అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో శనివారం తాలిబన్లు మారణహోమం సృష్టించారు. నగరంలో రద్దీగా ఉన్న ప్రాంతంలో ఆత్మాహుతి దాడికి పాల్పడి 95 మంది ప్రాణాల్ని బలితీసుకున్నారు. ఈ దాడిలో 151 మంది గాయపడ్డారు. అంబులెన్స్‌లో భారీగా పేలుడు పదార్థాలు నింపి దానిని పేల్చేయడంతో ఈ ఘోరం జరిగింది. ఏం జరిగిందో తెలియక కొద్ది సేపు షాక్‌కు గురైన ప్రజలు వెంటనే తేరుకుని పరుగులు తీశారు. పేలుడు తమ పనేనని ఉగ్రవాద సంస్థ తాలిబన్ ప్రకటించుకుంది. తాలిబన్ అనుబంధ సంస్థ హక్కానీ నెట్‌వర్క్ పాత్ర ఉండవచ్చని అఫ్గాన్ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. అంతర్యుద్ధంతో తీవ్రంగా దెబ్బతిన్న కాబూల్‌లో ఇటీవల కాలంలో చోటుచేసుకున్న అతిపెద్ద దాడి ఇదే.