గత 5 రోజులుగా నడుస్తున్న లారీల సమ్మె ప్రభావం క్రమంగా సామాన్యులను తాకుతోంది. సమ్మె వల్ల రాష్ట్రంలో రూ. 10 వేల కోట్ల వ్యాపార లావాదేవీలు నిలిచిపోయినట్లు ఏపీ లారీ యజమానులు సంఘం వెల్లడించింది. కూరగాయల ధరలు రెక్కలు విచ్చుకుంటుండగా, ఇటుక, కంకర, సిమెంట్ సరఫరా తగ్గడంతో నిర్మాణ రంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. పశ్చిమ బెంగాల్ నుంచి బంగాళదుంపలు, మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయ దిగుమతులు ఆగిపోగా, రాష్ట్రం నుంచి టమాటా, ఇతర కూరగాయల ఎగుమతులు ఆగిపోయాయి. దీంతో కూరగాయల ధరలు క్రమేపీ పెరగుతున్నాయి. తొలుత నిత్యవసర వస్తువులను సమ్మె నుంచి మినహాయించాలని చూసినా ప్రభుత్వం దిగిరాకపోవడంతో కూరగాయల సరఫరాను ఆపేయాలని నిర్ణయించినట్లు లారీ యజమానుల సంఘం తెలిపింది. సిమెంట్, ఇసుక, కంకర సరఫరా ఆగిపోవడంతో నిర్మాణ రంగ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయి పనులు లేక కూలీలు రోడ్డునపడ్డారు. ప్రస్తుతానికి సమ్మె ప్రభావం ఎక్కువగా లేకపోయినా ఇంకో రెండు రోజులు దాటితే మాత్రం అన్ని రంగాలపై ప్రభావం పడుతుందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.