చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరడానికి కొద్దిరోజుల ముందు అధికంగా స్టెరాయిడ్స్ ఇవ్వడంతో తమిళనాడు దివంగత సీఎం జయలలిత అనారోగ్యంపాలయ్యారని విచారణ కమిషన్ ఎదుట ఆక్యుపంచర్ డాక్టర్ శంకర్ వాంగ్మూలం ఇచ్చారు. జయ మరణంపై నెలకొన్న అనుమానాలను నివృత్తిచేసేందుకు తమిళనాడు సర్కారు ఆదేశాలతో ఏర్పాటైన విచారణ కమిషన్ సంబంధీకులను విచారిస్తుండటం తెలిసిందే. ఇందులోభాగంగా 2016 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జయకు ఆక్యుపంచర్ వైద్యం అందించిన డాక్టర్ శంకర్‌ను మంగళవారం చెన్నైలోని కమిషన్ కార్యాలయంలో అధికారులు విచారించారు. ఈ సందర్భంగా శంకర్ తన వద్ద ఉన్న ఆధారాలను సమర్పించారు. అప్పట్లో జయ ఆరోగ్య పరిస్థితి తదితర అంశాలపై శంకర్ వివరణ ఇచ్చారు. అపోలో ఆస్పత్రిలో చేరడానికి కొద్దిరోజుల ముందు జయకు స్టెరాయిడ్స్ వాడారని, వాటిని అధిక మోతాదులో ఇవ్వడంవల్లే ఆరోగ్యం క్షీణించిందని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వ వైద్యులను విచారించారు.