టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటిపై గురువారం ఉదయం ఐటీ దాడులు చేసింది. జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అక్రమాల కేసు, ఓటుకు కోట్లు కేసు ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన రెండు ఐటీ బృందాలు హైదరాబాద్‌లోని రేవంత్ రెడ్డి ఇంటితో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. రేవంత్ రెడ్డితో పాటు ఆయన బంధువులు, సన్నిహితులైన 15మంది ఇళ్లు, కార్యాలయాలపై కూడా ఐటీ దాడులు జరుగుతున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ఉండగా.. కుటుంబ సభ్యులు తిరుపతిలో ఉండటంతో ఆయా చోట్ల అక్కడ ఉన్న సిబ్బందికి నోటీసీలు ఇచ్చి దాడులు చేసినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడికి సంబంధించిన పలు కంపెనీ లావాదేవీలపై కూడా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. లెక్కా పత్రం లేని అక్రమ ఆర్థిక లావాదేవీలపై వారు ఫోకస్ చేసినట్టు సమాచారం.