కాంగ్రెస్-టీడీపీ మధ్య డీల్ ఏమైనా కుదిరిందా? రెండు పార్టీలు ఒకరికొకరు సహాయాన్ని అందిపుచ్చుకోవాలని నిర్ణయించుకున్నాయా? రాజ్యసభలో మంగళవారం ప్రత్యేక హోదాపై స్వల్ప కాలిక చర్చ సందర్భంగా ఆ రెండు పార్టీల వ్యవహార శైలిని గమనిస్తే ఇదే అనిపిస్తోందంటున్నారు రాజకీయ పండితులు. స్వల్పకాలిక చర్చను మొదలుపెట్టిన టీడీపీ ఎంపీ సుజనా చౌదరి కొంతసేపు మాట్లాడాక.. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు కల్పించుకున్నారు. ‘చౌదరీ మీకు కేటాయించిన సమయం అయిపోయింది ఇక ముగించండి’ అని ఆయన సూచించారు. వెంటనే కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ లేచి నిలబడి సుజనా చౌదరికి మరికొంత సమయం ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే నిబంధనల ప్రకారం టీడీపీకి ఇచ్చిన సమయం అయిపోయిందని, ఇతర పార్టీలు తమకు కేటాయించిన సమయాన్ని వదులుకోడానికి సిద్ధంగా ఉంటే ఆ సమయాన్ని సుజనాకి ఇవ్వడానికి తనకి అభ్యంతరం లేదని వెంకయ్య నాయుడు అన్నారు.