కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన ‘కాపు సత్యాగ్రహ యాత్ర’ను రాష్ట్ర ప్రభుత్వం భగ్నం చేయడంతో తూర్పు గోదావరి జిల్లా నివురుగప్పిన నిప్పులా మారింది. కాపు నేతల అరెస్టులు, గృహ నిర్బంధాలు రెండో రోజు బుధవారం కూడా కొనసాగారుు. ముద్రగడను పరామర్శించడం కోసం వెళుతున్న వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, జక్కంపూడి రాజా ప్రభృతులను అరెస్టుచేసి సాయంత్రం వరకు పోలీస్‌స్టేషన్ లో నిర్బంధించారు. తర్వాత అంబటిని గుంటూరుకు బలవంతంగా తరలించారు. ముద్రగడ పద్మనాభంను మంగళవారం నుంచి పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెల్సిందే. డ్రోన్లు, బెల్ట్ కెమెరాలతో ముద్రగడ ఇంటి ప్రాంతాన్ని నిఘా నీడలో ఉంచారు. 2 వేల మంది పోలీ సులు పహారా కాస్తున్నారు.