రాష్ట్రానికి ఏవో గొప్పులు చేశామని చెప్పుకుంటున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నిప్పులు చెరిగారు. హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేశానని అంటున్న చంద్రబాబు నాయుడు తన హయాంలో ఏ ఒక్క ప్రాజెక్టును కూడా రాష్ట్రానికి ఎందుకు తీసుకురాలేదని నిలదీశారు. వైఎస్సార్ జిల్లాలోని గూడూరు ఎన్నికల రోడ్ షో భాగంగా విజయమ్మ ప్రసంగించారు. సమన్యాయం, రెండుటెంకాయల సిద్దాంతమంటూ తెలుగు ప్రజలను చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. తన హయాంలో ఒక్క వాగ్ధానం కూడా నిలుపుకోలేని ఆయన ఇప్పుడు లేనిపోని వాగ్దానాలతో ప్రజలను మభ్య పెట్టేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. ఆయన చెప్పే మాయమాటలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఆయన నిక్కర్లు వేసుకునే సమయంలోనే హైదరాబాద్ నగరం ఐదవ స్థానంలో ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు పాలన చేపట్టకముందే ఐటీ రంగంలో హైదరబాద్ మూడవ స్థానంలో ఉందన్న విషయం అందరూ గుర్తించాలన్నారు. కేంద్రంలో చక్రం తిప్పానన్న బాబు ఏ ఒక్క ప్రాజెక్టు అయినా రాష్ట్రానికి తీసుకువచ్చారా? అని విజయమ్మ ప్రశ్నించారు. జిల్లాకో యూనివర్శిటీ, మెడికల్ కాలేజీ ఇచ్చిన ఘనత ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కే దక్కుతుందన్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేసుకునే సమయం ఆసన్నమైందన్నారు. జగన్ విజయమే ప్రజల విజయం.. ప్రజల విజయమే జగన్ విజయం అని విజయమ్మ తెలిపారు. ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకే ఓటేసి వైఎస్సార్ సీపీని తిరుగులేని ఆధిక్యంతో గెలిపించాలన్నారు.