ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్ ను నాగ్ పూర్ సెంట్రల్ జైల్లో గురువారం ఉదయం 6:50 గంటలకు ఉరి తీశారు. చిట్టచివరి నిమిషంలో దాఖలైన పిటిషన్ ను దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనట్లుగా అర్ధరాత్రి 3 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు విచారించిన సుప్రీంకోర్టు, ఆ పిటిషన్ ను కూడా కొట్టేయడంతో ఇక మెమన్ కు అన్ని దారులూ మూసుకుపోయాయి. ముందు నుంచి సిద్ధంగా ఉన్న నాగ్ పూర్ సెంట్రల్ జైలు అధికారులు.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఉరిశిక్షను అమలు చేశారు. అంతకుముందు బుధవారం రాత్రి తన అన్న సులేమాన్ మెమన్, సమీప బంధువు ఉస్మాన్ లను యాకూబ్ మెమన్ కలుసుకున్నారు. గత వారం మెమన్ తన భార్య రహిన్, కూతురు జుబేదా తదితరులను కూడా కలుసుకున్నారు. పుణె ఎర్రవాడ జైలు నుంచి నాగ్ పూర్ కు మెమన్ ను 2007 ఆగస్టులో తరలించారు. ఆ తర్వాత సరిగ్గా 7 సంవత్సరాల 11 నెలల 17 రోజులకు అతడిని ఉరి తీశారు.