ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అభద్రతా భావం ఎందుకని రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ ప్రశ్నించారు. మీ కుర్చీకి అయిదేళ్ల వరకు ముప్పు ఏమీ లేనప్పుడు ఎందుకింత అరాచకంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబుని ఉద్దేశించి ఆయన అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రక్రియ మంచిదికాదని ఆయన సలహా ఇచ్చారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పే చంద్రబాబు ప్రతిపక్షమే లేకుండా ఉండాలన్న దురాలోనతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో ఇటువంటి దౌర్భాగ్యపరిస్థితిని చూడలేదన్నారు. అధికారం ఉందిగదా అని టిడిపి నేతలు తెగ రెచ్చిపోతున్నారన్నారు. అధికార అహంకారంతో వ్యవహరిస్తున్నారు. ప్రజలు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. కార్యకర్తలకు పోలీస్ దుస్తులు వేసి కూర్చోబెట్టండి. ఇక ఈ అయిదేళ్లు ప్రభుత్వం లేదనుకుందాం అని అన్నారు. శాసనసభాపతి నియోజకవర్గంలోనే ఇటువంటి దాడులా? అని ఆయన అడిగారు. టిడిపి నేతలు పద్దతి మార్చుకోవాలని కొణతాల సలహా ఇచ్చారు. పూర్తి మెజార్టీ ఉన్నప్పుడు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన చంద్రబాబుని ప్రశ్నించారు.