ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ ను ఉరితీసే నాగ్ పూర్ సెంట్రల్ జైలు, అక్కడి వార్ధా రోడ్డు రాత్రికి రాత్రే పూర్తి కంచుకోటల్లా మారిపోయాయి. బుధవారం రాత్రి నుంచే జైలు అధికారులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిషేధ ఉత్తర్వులు అమలుచేశారు. సెక్షన్ 144, సెక్షన్ 137 అమలుచేశారు.గురువారం సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రాంతంలోకి ఎవ్వరూ ప్రవేశించడానికి వీల్లేదని, ఒకవేళ వస్తే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కమిషనర్ రాజవర్ధన్ సిన్హా హెచ్చరించారు. ఇక ముంబైలో మెమన్ ల నివాసప్రాంతమైన మాహిమ్ కూడా కోటలా మారిపోయింది. క్విక్ రెస్పాన్స్ టీం కమాండోలు, అల్లర్లను నియంత్రించే దళానికి చెందిన పోలీసులు, రాష్ట్ర రిజర్వు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ముంబైలో పరిస్థితులను అదుపు చేయడానికి 35వేల మంది పోలీసులను దించామని, ఈరోజు అందరికీ సెలవులు రద్దుచేశామని, ఇప్పటికే సెలవులో ఉన్నవాళ్లను కూడా వెనక్కి పిలిపించామని ముంబై పోలీసు అధికారి ఒకరు తెలిపారు.