తమిళనాడులోని శివకాశీలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బాణసంచా గిడ్డంగి వద్ద జరిగిన భారీ అగ్నిప్రమాదంలో పక్కనున్న స్కాన్‌సెంటర్‌కు దట్టమైన పొగలు వ్యాపించటంతో తొమ్మిదిమంది దుర్మరణం పాలయ్యారు. 20మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఆరుగురు మహిళలున్నారు. శివకాశీ బైపాస్ రోడ్డులోని ప్రయివేటు బాణసంచా గిడ్డంగి వద్ద ఈ ఘటన జరిగింది. రిటైల్ దుకాణాలకు సరుకు చేరవేసేందుకు గురువారం మధ్యాహ్నం 20 మంది కూలీలు బాణ సంచా బండిళ్లను రెండు వ్యాన్లలోకి సర్దుతున్నారు. ఇంతలోనే బండిళ్లలోని టపాసులు ఒకదానికి ఒకటి రాసుకోవడంతో మంటలు చెలరేగాయి. దీంతో వాహనంలోని టపాసులు పేలి మంటలు గిడ్డంగి లోకి వ్యాపించటంతో ఎగసిపడ్డాయి.