తెలంగాణ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్యను మంత్రివర్గం నుంచి తప్పించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. వైద్య ఆరోగ్యశాఖలో అవినీతి విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం. అందుకే ఆ శాఖను నిర్వర్తిస్తున్న డాక్టర్ రాజయ్యను తప్పించి.. ఆ స్థానంలో ఎంపీ కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ నరసింహన్కు కూడా చెబుతారని, ఆ తర్వాత ఈ వ్యవహారం పూర్తవుతుందని అంటున్నారు. కడియం శ్రీహరికి విద్యుత్ శాఖను కేటాయించి, మరో మంత్రి లక్ష్మారెడ్డికి వైద్య ఆరోగ్య శాఖను ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రాజయ్య పేషీలోని అధికారులందరినీ తప్పించిన కేసీఆర్.. ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎంను కూడా తొలగించాలని తీవ్ర నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇప్పటికే కడియం శ్రీహరి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు.