టీడీపీలోకి చేరనా అని అడిగితే వద్దన్నారు: ధర్మాన

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వ్యవహరించిన తీరు సీమాంధ్రుల మనోభావాలను గాయపరిచిందని రాష్ట్ర మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఇన్ని సంవత్సరాలు అనుభవం కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇలా చేస్తుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల జీవితాన్ని ఆగమ్యగోచరం చేసిన కాంగ్రెస్లో కొనసాగకూడదన్న నిర్ణయంతో ఆ పార్టీని వీడానని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ధర్మాన.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఉన్న నాయకులు, కార్యకర్తల అభిప్రాయాల మేరకు కాంగ్రెస్ను వీడానని చెప్పారు. టీడీపీలోకి చేరనా అని అడిగితే వద్దన్నారని చెప్పారు. కాంగ్రెస్లో కొనసాగనా అంటే వద్దేవద్దన్నారని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డితో వెళ్లనా అంటే వెళ్లూ వెళ్లూ అన్నారని తెలిపారు.

రాష్ట్ర విభజనతో నష్టాలే ఎక్కువని ధర్మాన అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. చంద్రబాబు ఈరోజుకి కూడా తన అభిప్రాయాన్ని చెప్పలేని దుస్థితిలో ఉన్నారని విమర్శించారు. ఆయనకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. జగన్ అహంకారి అంటూ కొంత మంది నాయకులు అభూత కల్పనలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్పై చేస్తున్న అసత్య ప్రసారాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top