లోక్సభ నుంచి సస్పెండ్ అయిన చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ మరోసారి వినూత్నంగా తన నిరసన తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ఆయన గురువారం మీడియా ఎదుట కొరడాతో కొట్టుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని శివప్రసాద్ డిమాండ్ చేశారు. కాగా కొద్ది రోజుల క్రితం ఆయన కృష్ణుడి వేషధారణతో లోక్సభకు హాజరయిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్ర అట్టుడుకుతుందని పద్యాల ద్వారా ఆయన సభకు తెలియచేశారు. కాగా జస్టిస్ శ్రీకృష్ణ కమిటీపై పార్లమెంట్లో చర్చించాలని టీడీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. అన్ని ప్రాంతాల వారు సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారన్నారు. సీమాంధ్ర ప్రజలను శాంతపరిచే ప్రకటన వెలువడేవరకూ తమ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనతో వచ్చే సమస్యలపై తమతో ఎవరూ సంప్రదించలేదని వారు తెలిపారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ నలుగురు టీడీపీ ఎంపీలతో పాటు ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే.