అటకెక్కిన ఆంటోనీ కమిటీ.. జీవోఎం రాకతో హుష్ కాకి | As GoM on Telangana is in place, Antony panel wound up | Sakshi
Sakshi News home page

Oct 15 2013 12:12 PM | Updated on Mar 21 2024 8:50 PM

తెలంగాణ ప్రకటన అనంతరం సీమాంధ్ర ప్రాంతంలో చెలరేగిన ఆందోళనలను చల్లార్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుచేసిన ఆంటోనీ కమిటీ కాస్తా అటకెక్కేసింది. కమిటీలో ఉన్నదే ఇద్దరు సభ్యులు. వారిలో ఒకరు రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ కాగా.. మరొకరు చమురుశాఖ మంత్రి వీరప్పమొయిలీ. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు, ఇతరులు వెళ్లి, రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలు ఏంటన్న విషయాన్ని చెప్పుకోడానికి వీలుగా ఈ కమిటీని పార్టీ తరఫున ఏర్పాటు చేశారు. కానీ కొన్నాళ్ల పాటు నాయకులు వెళ్లి వచ్చిన తర్వాత.. ఆంటోనీ అనారోగ్యం పాలయ్యారు. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో ఆయన ఆస్పత్రి పాలు కావడం, శస్త్రచికిత్స చేయించుకోవాల్సి రావడంతో కమిటీ పని దాదాపుగా ఆగిపోయింది. తొలుత రాష్ట్రానికి కూడా ఆంటోనీ కమిటీని ఆహ్వానిస్తున్నట్లు సీమాంధ్రప్రాంత కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంతా చెప్పారు. కానీ అది జరగలేదు. ఆ తర్వాత ప్రభుత్వం తరఫున మంత్రుల బృందం ఒకదాన్ని ఏర్పాటు చేశారు. మొదట్లో 11 మందితో ఏర్పాటుచేసిన బృందం నుంచి తర్వాత కొంతమందిని తొలగించి, మరికొందరిని కలిపి చివరకు ఏడుగురితోనే సరిపెట్టేశారు. కేవలం సీమాంధ్ర ప్రాంతంలో తీవ్రస్థాయిలో ఉన్న నిరసన జ్వాలలను చల్లార్చేందుకు, తెలంగాణ విషయంలో మరింత కాలయాపన చేసేందుకే కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేస్తోందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఆంటోనీ కమిటీ ఏమైందని, దాని పరిస్థితి ఏంటని కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీని విలేకరులు ప్రశ్నించినప్పుడు.. కమిటీ స్టేటస్ ఏంటో కూడా తనకు తెలియదని మొయిలీ అన్నారు. ఇప్పటికిక మంత్రులే చూసుకుంటారని ఆయన చెప్పారు. సీమాంధ్ర ప్రాంత నాయకులు మాత్రం ఇంకా ఆంటోనీ కమిటీ ఈరోజు వస్తుంది, రేపు వస్తుందని ఎదురు చూస్తున్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా వేసిన కమిటీ చివరకు తూతూమంత్రంగానే తేలిపోయింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement