సాక్షి ప్రతినిధి, కడప : సీఎం హోదాలో చంద్రబాబు పలుమార్లు జిల్లాకు వచ్చారు. గతేడాది మూడు రోజుల పాటు మహానాడు నిర్వహించారు. ఆయా బహిరంగ సభల సాక్షిగా.. నిండు వేదికపై ఎన్నో హామీలు గుప్పించారు. ఒక్కటంటే ఒక్కటీ నెరవేర్చింది లేదు.‘నేను రాయలసీమ బిడ్డను’ అని తనంతట తాను గొప్పలు చెప్పుకోవడం మినహా సీమకు ఆయన చేసిందేమీ లేదని జిల్లా ప్రజలు తూర్పారబడుతున్నారు. ఈ ప్రాంతానికి ప్రత్యేకించి అభివృద్ధి ఫలాలు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శిస్తున్నారు. అందుకు పులివెందుల మెడికల్ కళాశాల ఉదంతాన్ని వివరిస్తున్నారు. పేదింటి బిడ్డలకు వైద్య విద్య అందుబాటులోకి తీసుకురావాలన్న సదాశయంతో రూ.530 కోట్లతో వైఎస్ జగన్ సర్కార్ ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మిస్తే... నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) మంజూరు చేసిన 50 ఎంబీబీఎస్ సీట్లను సైతం చంద్రబాబు తిరస్కరించడాన్ని పలువురు చెప్పుకొస్తున్నారు.
మహానాడు వేదికగా ఇచ్చిన
రూ.1380 కోట్ల హామీలకు దిక్కులేదు..
జిల్లా కేంద్రమైన కడపలో 2025లో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించారు. మే 27–29 వరకూ సీఎం చంద్రబాబు ఇక్కడే తిష్టవేశారు. చివరిరోజు సమావేశంలో ‘తమ్ముళ్ల’ సాక్షిగా జిల్లా అభివృద్ధి కోసం హామీలు ఇచ్చారు. జీఎన్‌ఎస్‌ఎస్ ఫేజ్–1 పనులు నిధుల లేమి కారణంగా ఆలస్యంగా నడుస్తోన్నాయని అందుకు కోసం రూ.1000 కోట్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. వీరపునాయునిపల్లె, వేంపల్లె, వేముల, పెండ్లిమర్రి, చింతకొమ్మదిన్నె, వల్లూరు, కమలాపురం, కడప మండలాల్లో భూసేకరణ, పెండింగ్ పనులు నిర్వహణ కోసం వెచ్చించనున్నట్లు గొప్పలు చెప్పారు. కానీ ఇంతవరకు అవేవీ కార్యరూపం దాల్చలేదు. అలాగే వామికొండ, సర్వారాయసాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కోసం రూ.170 కోట్లు, గండికోటలో శ్రీకృష్ణదేవరాయులు విగ్రహాం ఏర్పాటుకు రూ.32.5కోట్లు, ఆంధ్రప్రదేశ్ అర్బన్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ కింద కడపకు రూ.68.45కోట్లు, బుగ్గవంక ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ.100కోట్లు, చెన్నూరు సమీపంలో ఉన్న హజ్‌హౌస్ పూర్తి కోసం రూ.10 కోట్లు మొత్తం రూ.1380.9 కోట్లు కేటాయించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఒకటా రెండా సీఎం హోదాలో హామీలిచ్చి 15నెలలైనా ఇసుమంత పురోగతి లేకపోవడంపై జిల్లా వాసులు మండిపడుతున్నారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్వీర్యం..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాయలసీమ కరువు నివారణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. రాయలసీమ ప్రాజెక్టులకు నీటి కొరత లేకుండా ఉండేందుకు రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టు (ఆర్డీఎంపీ) ప్రణాళికలు చేసింది. శ్రీశైలం రిజర్వాయర్‌లో 800 అడుగుల నీటిమట్టం వద్ద ఎత్తిపోతల పథకానికి 2020లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్ శ్రీకారం చుట్టింది. రోజుకు 3టీఎంసీల చొప్పున నీరు డ్రా చేసుకునే వీలుగా కార్యాచరణ చేపట్టింది. తద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు నీరు పుష్కలంగా ఉండే చర్యలు చేపట్టింది. అలాగే జీఎన్‌ఎస్‌ఎస్–హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ అనుసంధానం ప్రక్రియను ప్రారంభించి వేగవంతంగా పనులు చేపట్టింది. ఇప్పుడా ప్రాజెక్టులన్నీ ప్రశ్నార్థకంగా మారాయి. ఏకంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సీఎం చంద్రబాబు సర్కార్ నిలిపేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభ్యర్థన మేరకు రాయలసీమ వాసులకు సీఎం చంద్రబాబు అన్యాయం చేశారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
నేడు సీఎం రాక
ప్రొద్దుటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం 10.20 గంటలకు ప్రొద్దుటూరు మండలంలోని అమృతానగర్ హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ప్రజల వినతులను స్వీకరించిన అనంతరం రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి అమృతానగర్‌లో ఏర్పాటు చేసిన జల్‌జీవన్ మిషన్ పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం తిమ్మయ్య కల్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికకు చేరుకుని 10.45 గంటల నుంచి 12.55 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు.
జిల్లా పర్యటనకు బాబు..
మహానాడు హామీల అమలుపై జిల్లా ప్రజల నిలదీత
జల్ జీవన్ మిషన్ శంకుస్థాపన పేరిట ఆర్భాటం.. సీమ ప్రాజెక్టుల ఊసు మరిచిన వైనం
పాత వాగ్దానాలు ‘నీళ్ల’ పాలు...‘జల్ జీవన్’తో’ నాటకాలు!
శిలాఫలకాలు ఆవిష్కరించడం.. బహిరంగంగా అబద్ధాలు వల్లె వేయడం..
అదీ కాదంటే వైఎస్సార్‌సీపీ హయాంలో పూర్తయిన పనులను ప్రారంభించి క్రెడిట్ చోరీ చేయడం.. ఇదీ కూటమి ప్రభుత్వం కొలువుదీరాక సీఎం హోదాలో చంద్రబాబు సాగిస్తున్న పాలన తీరు. ప్రస్తుతం సీఎం, డిప్యూటీ సీఎంల ప్రొద్దు‘టూరు’ కూడా ‘క్రెడిట్ చోరీయే’.
సీమ ప్రాజెక్టు ఊసు మరిచి.. పాత వాగ్దానాలు ‘నీళ్ల’పాలు చేసి...
జల్‌జీవన్‌తో కొత్త నాటకాలకు తెరతీయడంపై జిల్లా ప్రజలు మండిపడుతున్నారు.
హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తే రుబాబు చేయడం మినహా..
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలనే చిత్తశుద్ధి బాబుకు కరువైందని తూర్పారబడుతున్నారు.
క్రెడిట్ చోరీలో భాగమే..
జల్ జీవన్ మిషన్‌లో భాగమైన పులివెందుల వాటర్ గ్రిడ్ పథకానికి 2021 జూన్‌లో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. కేంద్ర జలజీవన్ మిషన్ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కలిపి రూ.480 కోట్లతో ఈ పథకాన్ని రూపొందించి శరవేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా 117.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటిని పులివెందుల వాటర్ గ్రిడ్ పథకానికి తీసుకురావడానికి పైపులైన్ వేయాల్సి ఉండగా 108 కిలోమీటర్లు పైపులైన్ మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో చేపట్టారు. లింగాల మండలం పార్నపల్లె వద్ద వాటర్ శుద్ధి కేంద్రాన్ని కూడా పూర్తి చేశారు. ఓవర్ హెడ్ ట్యాంకులు సంపుల తదితర పనులను కూడా పూర్తి చేశారు. దాదాపు 90 శాతం పనులు పూర్తి కాగా, రెండేళ్లు కాలంలో 10శాతం పనులు కూడా సీఎం చంద్రబాబు సర్కార్ పూర్తి చేయలేదు. తాజాగా ‘జల్‌జీవన్ మిషన్ అమరజీవి జలధార’ కార్యక్రమం పేరిట ప్రొద్దుటూరులో పైలాన్ ఆవిష్కరించనున్నారు. ఇది పూర్తిగా క్రెడిట్ చోరీ చేయడమేనని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.


