అతిథుల చేతిలో ఇంటర్‌ భవిత | - | Sakshi
Sakshi News home page

అతిథుల చేతిలో ఇంటర్‌ భవిత

Oct 5 2026 1:27 AM | Updated on Oct 5 2026 1:27 AM

కడప ఎడ్యుకేషన్‌ : జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల పరిస్థితి దారుణంగా తయారైంది. పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన సర్కారు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంతో కళాశాలలను రెగ్యులర్‌ అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కూటమి ప్రభుత్వం కొత్తగా నియామకాలు చేపట్టకపోవడంతో ఇంటర్‌ బోధన అంతా కాంట్రాక్టు, గెస్ట్‌(అతిథి) లెక్చరర్లతోనే సాగుతోంది. దీనికితోడు క్రీడారంగాన్ని కూడా పూర్తిగా పట్టించుకోకపోవడంతో విద్యార్థులు మానసిక, శారీరక ఆరోగ్యంతోపాటు ఆటలకు దూరమవుతున్నారు.

అరకొర జీతాలతో కాలం వెల్లదీత!

జిల్లాలోని 24 ప్రభుత్వ, 6 ఎయిడెడ్‌ కళాశాలల్లో కలిపి ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి మొత్తం 5,350 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి నాణ్యమైన బోధన అందాలంటే రెగ్యులర్‌ అధ్యాపకులు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే జిల్లావ్యాప్తంగా మొత్తం 415 అధ్యాపక పోస్టులు ఉండగా, కేవలం 252 మంది మాత్రమే రెగ్యులర్‌ అధ్యాపకులు ఉన్నారు. మిగిలిన స్థానాల్లో 97 మంది కాంట్రాక్టు, 66 మంది గెస్ట్‌ లెక్చరర్లు పనిచేస్తున్నారు. రెగ్యులర్‌ అధ్యాపకులకు రూ. లక్షల్లో జీతాలు ఇవ్వాల్సి వస్తుందని భావిస్తున్న కూటమి సర్కారు.. కాంట్రాక్టు లెక్చరర్లకు రూ. 57,100, గెస్ట్‌ లెక్చరర్లకు రూ. 27,660 ఇస్తూ కాలం నెట్టుకొస్తోంది. కాంట్రాక్టు లెక్చరర్లకు అదనపు జీతం ఇవ్వాల్సి వస్తుండటంతో, వారిని పక్కన పెట్టి గెస్ట్‌ లెక్చరర్లను నియమిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వీరికి గంటకు రూ. 375 చొప్పున, నెలకు గరిష్ఠంగా 72 పీరియడ్లకు (ఏడాదిలో 11 నెలల పాటు మాత్రమే) దాదాపు రూ. 27 వేలు చెల్లిస్తూ సరిపెడుతున్నారు.

ప్రమోషన్లు వచ్చినా.. పాత చోటే!

జిల్లాలో ఇటీవల జూనియర్‌ లెక్చరర్లుగా పనిచేస్తున్న పలువురికి డిగ్రీ కళాశాల లెక్చరర్లుగా పదోన్నతి కల్పించారు. విద్యా సంవత్సరం మధ్యలో వీరు వెళ్లిపోతే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో బోధన కుంటుపడుతుందనే నెపంతో వీరిని ఇక్కడే డిప్యూటేషన్‌పై కొనసాగిస్తున్నారు. ఇలా జిల్లావ్యాప్తంగా 28 మంది అధ్యాపకులు డిగ్రీ కళాశాల లెక్చరర్ల హోదా పొందినా.. పాత జూనియర్‌ లెక్చరర్ల జీతాలనే తీసుకుంటూ ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు.

వ్యాయామ విద్య నిర్వీర్యం..

జిల్లాకు ఇద్దరే పీడీలు!

కూటమి ప్రభుత్వం క్రీడారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఉద్యోగ నియామకాల్లో క్రీడాకారులకు 3 శాతం రిజర్వేషన్లు ప్రకటించామని గొప్పలు చెప్పుకుంటోందే తప్ప క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. సాధారణంగా విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రతి కళాశాలకు ఒక పీడీ ఉండాలి. కానీ, జిల్లాలోని మొత్తం 30 కళాశాలలకు గాను కేవలం పోరుమామిళ్ల, రాజంపేట జూనియర్‌ కళాశాలల్లో మాత్రమే ఇద్దరు పీడీలు (ఫిజికల్‌ డైరెక్టర్లు) పనిచేస్తున్నారు. మిగతా ఎక్కడా వ్యాయామ ఉపాధ్యాయులు లేరు. ఉన్న పోస్టులను కూడా ఇటీవల కూటమి సర్కార్‌ పీడీ పోస్టుల నుండి లెక్చరర్‌ పోస్టులుగా కన్వర్షన్‌ (మార్పిడి) చేసింది. దీంతో కళాశాలల్లో వ్యాయామ విద్య పూర్తిగా నిర్వీర్యమైంది. పాఠశాల స్థాయిలో క్రీడల్లో రాణించిన క్రీడాకారులు.. జూనియర్‌ కళాశాలకు వచ్చే సరికి క్రీడలకు పూర్తిగా దూరమవుతున్నారు. చదువుతోపాటు క్రీడల్లో రాణించి ఉద్యోగం సాధిద్దామని ఆశపడుతున్న విద్యార్థులకు నిరాశే ఎదురవుతోంది. ఇప్పటికై నా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పూర్తిస్థాయిలో రెగ్యులర్‌ అధ్యాపకులు, పీడీలను నియమించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

జిల్లాలో వేధిస్తున్న రెగ్యులర్‌ అధ్యాపకుల కొరత

కూటమి సర్కారు నిర్వాకంతో నాణ్యమైన విద్యకు దూరమవుతున్న పేద విద్యార్థులు

జిల్లావ్యాప్తంగా కేవలం ఇద్దరే పీడీలు.. క్రీడారంగానికి పూర్తిగా తిలోదకాలు

బోధనకు ఎలాంటి ఆటంకం లేదు

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో బోధనలకు ఎలాంటి ఆటంకం లేదు. ఉద్యోగ విరమణ పొందిన అధ్యాపకుల స్థానాల్లో గెస్టు లెక్చరర్లను నియమించి బోధనలు సాగిస్తున్నాం. ప్రభుత్వం త్వరలోనే రెగ్యులర్‌ అధ్యాపక పోస్టుల నియామక ప్రక్రియ చేపట్టనుంది. ఆ తర్వాత అన్ని కళాశాలలకు పూర్తిస్థాయిలో రెగ్యులర్‌ అధ్యాపకులు వస్తారు.

– పి.ఎల్‌.ఎన్‌. ప్రకాస్‌రావు పట్నాయక్‌,

డీవీఈఓ, ఇంటర్‌ విద్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement