చాపాడు: మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని ముక్కొండ గగ్గితిప్పను బోడి గుండు కొట్టిస్తున్నారు. రోజూ వందల కొద్దీ టిప్పర్లు, ట్రాక్టర్లతో కొండ మట్టిని అక్రమంగా తరలిస్తూ అధికార పార్టీ నేతలు జేబులు నింపుకొంటున్నారు. పేరుకేమో బెంగళూరు–విజయవాడ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే రోడ్డు నిర్మాణానికి.. మట్టి తరలించేందుకు సదరు నిర్మాణ సంస్థ అనుమతులు తెచ్చుకుంది. ఇప్పటికే రోడ్డు నిర్మాణానికి అవసరమైన మేరకు మట్టిని తరలించేశారు. రోడ్డుపై బీటీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రోడ్డు నిర్మాణ పనుల మాటున అధికార పార్టీ నేతలు వందల సంఖ్యలో టిప్పర్లు, ట్రాక్టర్లతో మట్టిని మైదుకూరు, ప్రొద్దుటూరు, బద్వేలు, కడప నియోజకవర్గాలకు తరలిస్తూ కోట్లాది రూపాయలు అక్రమ మార్గంలో సంపాదిస్తున్నారు. ఈ తతంగం మొత్తం అన్ని శాఖలకు చెందిన అధికారులు చూస్తున్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
మల్లేశ్వరస్వామి కొలువుదీరి ఉన్నా...
గత ప్రభుత్వ హయాంలో వైజాగ్ వద్ద గల రుషికొండను పర్యాటక అభివృద్ధి చేస్తూ భవనాలను నిర్మించే క్రమంలో.. రుషికొండను బోడిగుండు కొట్టిస్తున్నారంటూ ఇప్పటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్పట్లో నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. మైదుకూరు – బద్వేలు జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ కొండపై మల్లేశ్వరస్వామి కొలువుదీరి ఉన్నారు. దారిన వెళ్లే చూపరులను ఈ ముక్కొండ అందాలు కనువిందు చేస్తాయి. ఇలాంటి కొండ చుట్టూ పెద్ద ఎత్తున తవ్వకాలు చేపట్టడంతో.. కొండను ముక్కలు చేస్తున్నారంటూ దారిన వెళ్లే వారు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికార యంత్రాంగం స్పందించి ముక్కొండను కొల్లగొట్టడంపై చర్యలు తీసుకుని ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని కోరుకుంటున్నారు.
రోడ్డు నిర్మాణం మాటున మట్టి దోపిడీ
రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా
పట్టించుకోని అధికార యంత్రాంగం


