● నిరసనగా తాళం వేసిన గ్రామస్తులు!
కమలాపురం: మండల పరిధిలోని ఎర్రగుడిపాడు గ్రామానికి చెందిన దళితులకు అధికారులు ఆలయ దర్శనం కల్పించారు. ఎర్రగుడిపాడులోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయానికి గతంలో ఎప్పుడూ ఎస్సీలు వెళ్లేవారు కాదు. ఈ నెల 3వ తేదీన అదే గ్రామానికి చెందిన చంద్ర అనే వ్యక్తి తన కుమారుడు, కుమార్తెతో కలసి స్వామివారిని దర్శించుకోవాలని వెళ్లాడు. అక్కడే ఉన్న ఆ గ్రామ మాజీ సర్పంచ్ బ్రహ్మానందరెడ్డి వారిని వారించి గ్రామ కట్టుబాట్లు పాటించాలని, ఆలయంలోకి వెళ్లవద్దని మందలించాడు. బయటి నుంచే స్వామి వారిని దండం పెట్టుకోవాలని మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. జిల్లా ఎస్పీ, కలెక్టర్ వారికి ఆలయ దర్శనం కల్పించాలని డీఎస్పీ బాలస్వామిరెడ్డి, ఆర్‌డీఓ మురళీకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారు సీఐ మోహన్, ఎస్‌ఐ శ్రీనివాసులు, తహసీల్దార్ శ్రీనివాసులరెడ్డితో కలసి అక్కడికి చేరుకుని చంద్ర తల్లి, కుమార్తె, కుమారుడికి ఆలయంలోకి తీసుకెళ్లి, స్వామివారి దర్శనం చేయించి టెంకాయ కొట్టించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, మహిళలు అక్కడికి చేరుకుని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి కట్టుబాట్లు ఉంటాయని, కనీసం తమతో చర్చించకుండానే వారికి ఆలయ ప్రవేశం చేయిస్తారా? అని ప్రశ్నించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము వారికి ఆలయ దర్శనం చేయించామని అధికారులు తెలిపారు. దీంతో అక్కడున్న మహిళలు గుడికి తాళం వేసి ఇకపై తాము ఆలయం తెరవబోమని చెప్పి వెళ్లిపోయారు.


