బాడుగ కార్లు.. తాకట్టు పెట్టి.. | - | Sakshi
Sakshi News home page

బాడుగ కార్లు.. తాకట్టు పెట్టి..

Oct 5 2026 1:27 AM | Updated on Oct 5 2026 1:27 AM

● కలసపాడు యువకుడు ఘరానా మోసం

● హైదరాబాద్‌ సంస్థ బోర్డు

తిప్పేయడంతో వెలుగులోకి..

● జిల్లాలో 50 కార్ల గుర్తింపు

కలసపాడు : కలసపాడు, కాశినాయన మండలాల్లో.. బాడుగ కార్లతో తాకట్టు దందా వెలుగులోకి వచ్చింది. కార్లను బోగస్‌గా తాకట్టుపెట్టి లక్షలాది రూపాయలు వసూలు చేసి తాకట్టుదారులను నిలువునా ముంచాడు ఓ ఘనుడు. అసలు యజమానులు తమ కార్లు తాకట్టులో ఉన్నాయని గగ్గోలు పెట్టడంతో.. బోగస్‌ కార్ల దందా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌ కేంద్రంగా కొందరు.. కార్లను బాడుగకు పెట్టుకుంటామని సంస్థను స్థాపించి పలువురి వద్ద నుంచి కార్లను సేకరించారు. నెల నెలా బాడుగ పంపుతున్న సంస్థ నుంచి బాడుగ రాకపోవడంతో కార్ల యజమానులు ఆరా తీశారు. సంస్థ బోర్డు తిప్పేయడంతో తమ కార్ల గురించి విచారణ చేశారు. కలసపాడు, కాశినాయన మండలాల్లో హైదరాబాద్‌కు చెందిన సుమారు 50 కార్ల వరకు ఉన్నట్లు గుర్తించారు.

పోలీస్‌స్టేషన్‌కు చేరిన సమస్య

కలసపాడు మండలం మహానందిపల్లెకి చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లో ఉంటున్నాడు. అతను హైదరాబాద్‌లోని సంస్థ నుంచి కార్లు బాడుగకు తీసుకున్నాడు. వాటిని ఇక్కడ కుదవ పెట్టాడు. తమ వద్ద కార్లు ఉన్నాయని, కొంత డబ్బు అవసరం ఉందని.. తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తామని, కార్లు ఉంచుకుని తాకట్టుకు ఇవ్వాలని అతను ఇక్కడి ప్రజలను నమ్మించాడు. తమ డబ్బుకు వడ్డీతోపాటు కార్లు వస్తున్నాయని ఆశపడ్డ జనం తాకట్టుకు ఎగపడ్డారు. తీరా తెలంగాణ కార్ల యజమానులు ఆరా తీయడంతో.. అవి అసలు తాకట్టు కార్లు కావని, బోగస్‌ సంస్థ నుంచి తమకు అందజేశారని తెలుసుకున్నారు. కార్ల యజమానులు వచ్చి తమ కార్లను తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. తాకట్టుదారులు అందజేసేందుకు నిరాకరించారు. విషయం పోలీసుల వరకు వెళ్లడంతో.. తెలంగాణ కార్ల యజమానులకు వారు సర్దిచెప్పి డబ్బు చెల్లించి తీసుకెళ్లాలని తేల్చి చెప్పారు. తెలంగాణ కార్ల యజమానులు లీగల్‌ గానే ముందుకెళ్లేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. అక్కడ కేసు నమోదు చేయించి లీగల్‌గా కార్లు తీసుకెళ్లాలని వారు భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో కార్లు తాకట్టులో పెట్టుకుని డబ్బులు అందజేసిన వారు ఆందోళనకు గురవుతున్నారు. తమ డబ్బు పోగొట్టుకోవడమే కాకుండా లీగల్‌గా కేసును ఎదుర్కోవాల్సి వచ్చిందని భయాందోళన చెందుతున్నారు. కార్ల దందా పంచాయతీపై తెలంగాణ పోలీసులు ఏవిధంగా చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement