● అదుపు తప్పిన బొగ్గు లారీ
● క్రాస్ చేస్తూ ట్రాక్టర్‌పై బోల్తా
● ట్రాక్టర్‌లో ఇరుక్కుపోయి
మరణించిన కూలీ
చాపాడు : ముందు వెళుతున్న పశుగ్రాసం ట్రాక్టర్‌ను క్రాస్ చేయబోయి బొగ్గు లారీ బోల్తా పడింది. ఈ సమయంలో కొంత వరకు ఢీకొని.. ట్రాక్టర్‌పై బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్‌లో ప్రయాణించే కూలీ పల్లవోలు ప్రభు కుమార్ (34) మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం చాపాడు సమీపంలో కుందూ నది దగ్గర చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని పల్లవోలు గ్రామానికి చెందిన పల్లవోలు ప్రభు కుమార్ ఇదే గ్రామానికి చెందిన మురళి అనే వ్యక్తికి చెందిన ట్రాక్టర్‌లో పశుగ్రాసం కోసం శనివారం రాత్రి నెల్లూరు జిల్లా సంఘం వెళ్లారు. అక్కడి నుంచి ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పశుగ్రాసం లోడుతో పల్లవోలు గ్రామానికి వస్తుండగా.. కుందూ నది సమీపంలో వెనుకవైపు వస్తున్న బొగ్గు లోడు లారీ ట్రాక్టర్‌ను ఓవర్ టేక్ చేయబోయి బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ కూడా బోల్తా పడటంతో ట్రాక్టర్ నడుపుతున్న మురళి అనే వ్యక్తి బయటికి దూకగా కూలిగా వెళ్లిన ప్రభుకుమార్ ట్రాక్టర్, లారీ కింద ఇరుక్కుపోయాడు. అప్పటికే లారీలో ఉండే డ్రైవర్ బయటికి దూకేయడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ట్రాక్టర్ కింద ఇరుక్కుపోయిన ప్రభుకుమార్‌ను ఎస్‌ఐ చిన్నపెద్దయ్య పర్యవేక్షణలో.. పోలీసులు 2 గంటల పాటు శ్రమించి జేసీబీ, క్రేన్‌ల సాయంతో బయటికి తీశారు. అప్పటికే ప్రభుకుమార్ మృతి చెందగా పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సోమవారం ప్రొద్దుటూరులో జరిగే సీఎం ప్రోగ్రాం కార్యక్రమంలో భాగంగా ఈ దారిన వెళుతున్న జేసీ నిధిమీనా దగ్గరికి.. మృతుడి బంధువులు వెళ్లి న్యాయం చేయాలని వేడుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సంఘటన స్థలం వద్దకు చేరుకుని ఆరా తీశారు. ప్రభుకుమార్‌కు భార్య రాణి, కూతర్లు సలోమి(15), చందు(13), లక్ష్మీ(10) ఉన్నారు.
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక జార్జ్ కారోనేషన్ క్లబ్‌లో నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ఐ అండర్ –19 బాలబాలికల రైఫిల్ షూటింగ్, ఫెన్సింగ్ పోటీలు క్రీడాకారుల మధ్య ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. రైఫిల్ షూటింగ్‌లో ఓపెన్‌సైట్, పీప్‌సైట్, పిస్టల్ విభాగాలలో పోటీలు నిర్వహించి 12 మంది క్రీడాకారులను, అలాగే ఫెన్సింగ్‌లో ఎప్పి, సాబర్, ఫాయిల్ విభాగాలలో పోటీలు జరిపి 24 మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్‌ఐ అండర్–19 పోటీలకు ఎంపిక చేశారు. ఈ పోటీలను జార్జ్ కారోనేషన్ క్లబ్ సెక్రటరీ మార్తల సుధాకర్‌రెడ్డి, ఎస్‌జీఎఫ్‌ఐ అండర్–19 సెక్రటరీ మురళీకృష్ణ, పోటీల అబ్జర్వర్ రాఘవేంద్ర, వ్యాయామ సంచాలకులు అల్లాబకాష్, నాగేశ్వరరావు, విలోనియారాణి పర్యవేక్షించారు.


