● తర్వాత తానూ ఆత్మహత్యాయత్నం
● కుటుంబ వివాదాల నేపథ్యం
చింతకొమ్మదిన్నె/కడప అర్బన్: వైఎస్సార్ కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం వేపమానుసత్రం గ్రామంలో శనివారం అర్ధరాత్రి దారుణం జరిగింది. ఇంటి బయట నిద్రిస్తున్న షేక్ షంషాద్ బేగం (42)ను కొడవలితో హత్య చేసిన అల్లుడు బండారు శ్రీను (31).. ఆపై తానూ బ్లేడ్‌తో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బేగంకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భర్త వల్లిబాషా ఐదేళ్ల క్రితం మృతి చెందాడు. కుమార్తె మహబూబ్‌చాన్ (21)కు గతంలో వివాహం కాగా, భర్తతో విభేదాల కారణంగా విడిపోయి తల్లి వద్దే ఉండేది. వ్యవసాయ పనులకు వెళ్లే క్రమంలో బేగంకు పెద్దకాంపల్లె గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ శ్రీనుతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో చాన్‌కు శ్రీనుతో ఏడాదిన్నర క్రితం వివాహం చేశారు. వివాహమైన కొన్ని రోజులకు శ్రీను వ్యవహారశైలిపై కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే చాన్ జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లింది. భార్య చాన్‌ను విదేశాల నుంచి రాకుండా అత్త అడ్డుకుంటున్నదనే అనుమానంతో శ్రీను ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శ్రీను కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. బేగం మామ(భర్త తండ్రి ) హుస్సేన్ పీరా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


