ఉల్లి రైతుల ఆశలపై నీళ్లు | - | Sakshi
Sakshi News home page

ఉల్లి రైతుల ఆశలపై నీళ్లు

Oct 4 2026 9:31 AM | Updated on Oct 4 2026 9:31 AM

● దళారుల మాయాజాలం

● ఒక్కసారిగా ధర తగ్గించిన వైనం

మైదుకూరు : మార్కెట్‌లో మంచి డిమాండ్‌, చేతికొచ్చిన అద్భుతమైన దిగుబడి ఉన్నా.. ఉల్లి రైతుల ఆశలు అడుగంటిపోతున్నాయి. దళారుల సిండికేట్‌ కారణంగా వారం రోజుల వ్యవధిలోనే ఉల్లి ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో మైదుకూరు మండల పరిధిలోని పెద్ద బళ్లారి ఉల్లి సాగుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. మహారాష్ట్రలో పంట నష్టాన్ని ఇక్కడి వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటూ, రైతులకు మాత్రం గిట్టుబాటు ధర దక్కకుండా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

వారం వ్యవధిలో..

మైదుకూరు మండలంలో సుమారు 2,400 ఎకరాల్లో రైతులు పెద్ద బళ్లారి రకం ఉల్లిని సాగు చేశారు. ప్రస్తుతం పంట కోత దశకు చేరగా, ఎకరాకు 20 క్వింటాళ్లకు పైగా ఆశించిన రీతిలో దిగుబడి వస్తోంది. వారం రోజుల క్రితం వరకు క్వింటాల్‌ ఉల్లి ధర రూ. 4,500 పలకడంతో రైతులు మంచి లాభాలు వస్తాయని ఆశించారు. అయితే, శనివారానికి దళారులు ఒక్కసారిగా ధరను రూ.2,500కు తగ్గించడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

ఎగుమతులు సాగుతున్నా.. దక్కని లాభం

మహారాష్ట్రలో వర్షాల కారణంగా ఉల్లి పంట దెబ్బతినడంతో, ప్రస్తుతం అక్కడి మార్కెట్లలో మన ఉల్లికి భారీ డిమాండ్‌ ఏర్పడింది. మైదుకూరు నుంచి పెద్ద ఎత్తున ఉల్లి మహారాష్ట్రకు ఎగుమతి అవుతోంది. ఇంత డిమాండ్‌ ఉన్న సమయంలో కూడా క్వింటాల్‌పై ఏకంగా రూ.2,000 తగ్గించడం వెనుక దళారుల కుట్ర దాగి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు, గత సీజన్‌తో పోలిస్తే ప్రస్తుతమున్న రూ. 2,500 ధర మెరుగైనదేనని వ్యవసాయ అధికారులు చెబుతున్నప్పటికీ.. మార్కెట్‌లో ఉన్న అసలు డిమాండ్‌కు అనుగుణంగా గరిష్ట ధర దక్కకపోవడం వల్ల తాము భారీగా ఆదాయాన్ని కోల్పోతున్నామని అన్నదాతలు వాపోతున్నారు.

ధర తగ్గడంతో ఆదాయం తగ్గింది

ధర తగ్గడంతో వస్తుందనుకున్న ఆదాయం తగ్గుతోంది. నాకున్న 1.10 ఎకరాల్లో ఉల్లిపంట సాగు చేశాను. సాగుకు రూ.30 వేలు ఖర్చుయింది. పంట ఎలా ఉన్నా ధర ఎంత ఉన్నా అమ్ముకోక తప్పని పరిస్థితి.

– బండి పెద్ద నారాయణ, రైతు, కేశలింగాయపల్లె, మైదుకూరు మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement