● దక్కని గిట్టుబాటు ధర
● ప్రకృతి కన్నెర్రతో తీరని వేదన
సింహాద్రిపురం : పెట్టిన పెట్టుబడులు రాక, పాలకుల ఆదరణ కరువై అరటి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు గిట్టుబాటు ధర లేకపోవడం, మరోవైపు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతినడంతో అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇటీవల ఏప్రిల్ నెలలో వీచిన ఈదురుగాలులకు అరటి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గెలలతో సహా పంట నేలకొరగడంతో రైతులు లక్షలాది రూపాయలు నష్టపోయారు. అయినా ఆశ చావని రైతులు, రెండో దశ పంటలోనైనా దిగుబడి వస్తుందనే నమ్మకంతో మళ్లీ అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టారు. అయితే ప్రస్తుత కరువు పరిస్థితులు, వర్షభావం వల్ల పంట ఆశించిన స్థాయిలో పండలేదు.
దీనికి నిదర్శనంగా శనివారం సింహాద్రిపురం మండలం కసనూరు గ్రామానికి చెందిన రైతు మధుసూదన్‌రెడ్డి.. దిగుబడి రాదనే వేదనతో తన నాలుగు ఎకరాల అరటి తోటను ట్రాక్టర్‌తో దున్నించేసి పంటను తొలగించారు.
కరువైన నష్టపరిహారం
పంటలు దెబ్బతిని ఇంతలా నష్టపోతున్నా కూటమి ప్రభుత్వం కానీ, అధికారులు కానీ స్పందించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు కేవలం క్షేత్రస్థాయి పరిశీలనలకే పరిమితమయ్యారని, ఇంతవరకు ఎలాంటి నష్టపరిహారం అందించలేదని వాపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, అరటి రైతుల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది.


