మైలవరం: మైలవరం జలాశయాన్ని సెప్టీ అధికారులు శుక్రవారం సందర్శించారు. ఈఈ చిన్న రంగప్పతో కలిసి సేప్టీ కమిటీ సభ్యులు జలాశయం గేట్ల వద్ద తనీఖీలను నిర్వహించారు. అలాగే మైలవరం రిజర్వాయర్ ఆనకట్టను గేట్లను, ప్రహారి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో రిటైర్డు సీనియర్ అధికారులు ఎంకె శ్రీనివాస్, ఎన్.వెంకటరమణ, పి.సుబ్బారావు, యు.రమేష్‌లు ఉన్నారు.ప్రస్తుత డ్యాం పరిస్థితిపై నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు తెలిపారు. ఏఈలు సుబ్బారావు, హనుమాన్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
4న జిల్లా సబ్–జూనియర్స్ కబడ్డీ ఎంపికలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 4న 36వ జిల్లా సబ్–జూనియర్స్ బాలబాలికల కబడ్డీ ఎంపికలు కడప మెయిన్ స్కూల్ మైదానంలో నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు గురు శేఖర్, కార్యదర్శి ఆర్. వెంకట సుబ్బయ్య, వర్కింగ్ సెక్రటరీ టి. శ్రీవాణి తెలిపారు. బాలుర విభాగంలో గరిష్ట బరువు – 60 కిలోలు 2010 డిసెంబర్ 12 లోపు జన్మించి ఉండాలన్నారు. బాలికల విభాగంలో గరిష్ట బరువు – 55 కిలోలు 2010 డిసెంబర్ 29 లోపు జన్మించి ఉండాలన్నారు. ఇతర వివరాలకు 9949304160, 9121497412 నంబర్లలో సంప్రదించాలన్నారు.
రెండు పాఠశాలల్లో
ఎస్‌ఎంసీ ఎన్నికలు రద్దు
కడప సెవెన్‌రోడ్స్ : కలసపాడు మండలంలోని తెల్లపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొండపేట గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించాల్సిన పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలను కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి రద్దు చేశారు. ఎస్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి డబ్బుల పంపిణీ జరిగినట్లు వచ్చిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని ఈ రెండు పాఠశాలల్లో జరగాల్సిన ఎన్నికలను రద్దు చేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.ఎన్నికల ప్రక్రియలో డబ్బుల పంపిణీ, ప్రలోభాలు లేదా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరిగినట్లు గుర్తించినా, లేదా ఫిర్యాదు అందినా, విచారణ చేపట్టి సంబంధిత ఎన్నికలను రద్దు చేసి, బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పరిశుభ్రత..అందరి బాధ్యత
కడప సెవెన్‌రోడ్స్ : పరిశుభ్రతను పాటించడం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా స్వీకరించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్‌చెరుకూరి తెలిపారు. శుక్రవారం మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ సభా భవనంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర అవార్డులు–2026 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వచ్ఛత పరిశుభ్రత రంగాల్లో సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలు, స్థానిక సంస్థలను అభినందించి అవార్డులను అందజేశారు. మొత్తం 65 మందికి అవార్డుల ప్రధానం చేశారు.
జెడ్పీ సీఈఓకు అవార్డు
జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సి.సుబ్రమణ్యంకు స్వచ్ఛ కార్యాలయ విశిష్ట గుర్తింపు అవార్డును కలెక్టర్ అందజేశారు. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో పరిశుభ్రత, పచ్చదనం, పరిసరాల పరిరక్షణ వంటి అంశాల్లో చేపట్టిన చర్యలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
నియామకం
కడప అర్బన్: కడపలోని జిల్లాకోర్టులో 6వ ఏడీజే ఫ్యామిలీకోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా భరణికుమార్ నాయుడును నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ ఆయ్యాయి. ఈయన 1997 నుంచి కడపలోని జిల్లా కోర్టులో న్యాయవాదిగా విధులను నిర్వహిస్తున్నారు.


