● ఎకరాకు రూ.50 వేల
ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలి!
● దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
వేంపల్లె : అకాల వడగండ్ల వాన, ఈదురు గాలుల వల్ల కోలుకోలేని విధంగా నష్టపోయిన అరటి రైతులకు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎకరాకు రూ.50 వేల ఇన్‌పుట్ సబ్సిడీని అందించాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం రాత్రి వీచిన ఈదురు గాలుల బీభత్సానికి వేంపల్లె మండలంలోని తాళ్లపల్లె, నందిపల్లె, కుప్పాలపల్లె, టి.వెలమవారిపల్లె, బక్కన్నగారిపల్లె గ్రామాల్లో దాదాపు 500 ఎకరాల్లో అరటి పంట పూర్తిగా నేలమట్టమైంది. ఈ నేపథ్యంలో తాళ్లపల్లె, కుప్పాలపల్లె, టి.వెలమవారిపల్లె ప్రాంతాల్లో దెబ్బతిన్న తోటలను శుక్రవారం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్వయంగా పరిశీలించారు.
సాగుదారులైన బంక సోమశేఖర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, ప్రసాద్ రెడ్డి తదితర రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మరో నాలుగు, ఐదు రోజుల్లో కోత కోసి మార్కెట్‌కు తరలించాల్సిన, ఒక్కోటి 30 నుంచి 40 కిలోల బరువున్న అరటి గెలలు నేలకొరగడం బాధాకరమన్నారు. సగటున ఎకరాకు రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టి, అప్పుల పాలైన రైతులకు ఇది తీరని నష్టమని అన్నారు. ఇటువంటి భారీ విపత్తుల సమయంలో ప్రభుత్వాలు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి అన్నదాతను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
బీమా నిబంధనలు పూర్తిగా లోపభూయిష్టం..
ప్రస్తుత క్రాప్ ఇన్సూరెన్స్ విధానం, వాతావరణ ఆధారిత స్టేషన్ల నమోదు ప్రక్రియపై ఎంపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గాలులు వీచిన గ్రామాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం ఉంటే, వేంపల్లెలోని వెదర్ స్టేషన్‌లో కేవలం 5 నుండి 6 కిలోమీటర్ల వేగమే నమోదు కావడం హాస్యాస్పదమన్నారు. ఆ రీడింగ్ ఆధారంగా బీమాను ఎలా నిర్ణయిస్తారని ప్రభుత్వాలను, ఇన్సూరెన్స్ కంపెనీలను ప్రశ్నించారు. ఎకరాకు రూ.3 వేలు ప్రీమియం కడుతున్న రైతులకు, నష్టపరిహారం ఇచ్చేటప్పుడు సాకులు చెప్పడం అన్యాయమన్నారు. ఈ రెండేళ్లుగా జిల్లా కలెక్టర్, ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తున్నామని.. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఇన్సూరెన్స్ కంపెనీల నిబంధనల లోపాలను సరిదిద్ది, బాధితులందరికీ న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ చంద్ర ఓబుల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ బీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్లూరు సుదర్శన్, వైఎస్సార్‌సీపీ నాయకులు ఉత్తమారెడ్డి, ప్రసాద్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.


