కడప అర్బన్: కడప కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ప్రతి ఖైదీ నేరప్రవృత్తికి దూరంగా ఉండాలని, సత్ప్రవర్తనతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నామనీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామ్‌గోపాల్ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్‌శాస్త్రి జయంతి, ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని కడపలోని కేంద్రకారాగారం, ప్రత్యేక మహిళా కారాగారాల్లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తిమాట్లాడుతూ ఖైదీలు సత్యం, అహింస, ధర్మబద్ధమైన జీవన విధానం పాటిస్తూ భవిష్యత్తులో నేర ప్రవృత్తికి దూరంగా ఉండాలని సూచించారు. అంతకు ముందు అతిథులు గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ ఎస్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ‘జైలు అనేది కేవలం శిక్షను అనుభవించే ప్రదేశం మాత్రమే కాదు; చేసిన తప్పులను తెలుసుకొని, వాటిని సరిదిద్దుకొని, కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఒక అవకాశం’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ షేక్ బాబా ఫక్రుద్దీన్, రిమ్స్‌సూపరింటెండెంట్ డాక్టర్ కె.పెంచలయ్య, కడప ఇన్‌చార్జి డీఎస్పీ ఈ. బాలస్వామి రెడ్డి, కడప కేంద్ర కారగారం సూపరింటెండెంట్ ఎస్. వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.


