● రెండేళ్ల కూటమి పాలనలోనే
రూ.4 లక్షల కోట్లకు పైగా అప్పులు
● అటు రైతులకు.. ఇటు ఉద్యోగులకు తీవ్ర అన్యాయం
● ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ధ్వజం
పులివెందుల : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను పూర్తిగా పక్కనబెట్టి, తన స్వప్రయోజనాలే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు. బుధవారం పులివెందులలోని తన స్వగృహం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు గడిచిన రెండున్నరేళ్ల కూటమి పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి, ఏకంగా రూ. 4 లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చారని మండిపడ్డారు. ఈ అప్పుల వలన ప్రజలకు ఎలాంటి సంక్షేమం అందలేదని, కేవలం చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసం దోచుకునేందుకే ఈ పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. అప్పులు చేయడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మడానికి కూడా చంద్రబాబు వెనుకాడటం లేదన్నారు. ఇప్పటికే 9 సహకార చక్కెర కర్మాగారాల ఆస్తులను, ఆర్టీసీ ప్రైవేటీకరణ ద్వారా సంస్థ విలువైన ఆస్తులను అమ్మడానికి ప్రణాళికలు సిద్ధం చేశారని మండిపడ్డారు. ఉన్న ఆస్తులను తెగనమ్మడం అభివృద్ధి కాదని హితవు పలికారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పేదల ఉచిత వైద్యం కోసం 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా.. కూటమి సర్కార్ వాటిని ప్రైవేట్‌పరం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల మెడికల్ కళాశాలకు మంజూరైన మెడికల్ సీట్లను కూడా ఈ ప్రభుత్వం ద్వేషంతో వెనక్కి పంపిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నదాతల పరిస్థితి దయనీయం..
ఉద్యోగులపై నిర్బంధాలు!
ప్రస్తుత ప్రభుత్వంలో అన్నదాతల పరిస్థితి మరీ దయనీయంగా మారిందని, పంటలకు గిట్టుబాటు ధరలు లేవని, ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే ఆదుకునే పంటల బీమా వ్యవస్థే లేదని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ’ధరల స్థిరీకరణ నిధి’ ద్వారా గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా, నెల రోజుల వ్యవధిలోనే బీమా సొమ్ము అందజేసేవారని గుర్తు చేశారు. ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ప్రశ్నిస్తే.. వారిపై నిర్బంధాలు విధిస్తూ, అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు పాలన కేవలం ’క్రెడిట్ చోరీ’కే పరిమితమైందని దుయ్యబట్టారు. విలేకరుల సమావేశం అనంతరం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తన పులివెందుల నివాసం వద్ద ప్రత్యేకంగా ’ప్రజా దర్బార్’ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి అర్జీలు, సమస్యల వినతులను స్వీకరించారు. బాధితుల సమస్యలను ఓపికగా విని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని, సంబంధిత అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని ఎంపీ భరోసా ఇచ్చారు.


