అగ్రిగోల్డ్‌ బాధితులకు ‘ప్రత్యేక కోర్టు’తోనే న్యాయం | - | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్‌ బాధితులకు ‘ప్రత్యేక కోర్టు’తోనే న్యాయం

Oct 1 2026 12:35 AM | Updated on Oct 1 2026 12:35 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : అగ్రిగోల్డ్‌ సంస్థలో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన బాధితులకు ప్రత్యేక కోర్డుతోనే న్యాయం జరుగుతుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం కడప నగరంలోని వైఎస్‌ఆర్‌ మెమోరియల్‌ ప్రెస్‌ క్లబ్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ బాధితులెవరూ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యల వంటి ఉన్మాద చర్యలకు దిగవద్దని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. దాదాపు 12 ఏళ్ల క్రితం దేశంలోని 8 రాష్ట్రాలకు చెందిన 32 లక్షల మంది బడుగు, బలహీన, కార్మిక వర్గాల ప్రజల నుంచి అగ్రిగోల్డ్‌ యాజమాన్యం రూ.6,300 కోట్లకు పైగా ఆర్థిక దోపిడీకి పాల్పడిందని ఆయన ధ్వజమెత్తారు. సంస్థ చైర్మన్‌ వెంకటరామారావు, డిప్యూటీ చైర్మన్‌ సీతారామారావుతో పాటు వారి కుటుంబ సభ్యులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారన్నారు. ఈ దారుణ మోసం కారణంగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే సుమారు 600 మంది బాధితులు గుండెపోటు, బలవన్మరణాలతో అకాల మరణం చెందడం కలిచివేసిందన్నారు. గతంలో మరణించిన వారిలో 140 మందికి మాత్రమే అప్పటి ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించిందని గుర్తు చేశారు. 8 రాష్ట్రాల్లోని బాధితుల నుంచి బాండ్లను, ఫొటోలను సేకరించేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్‌ విచారణ కేంద్రాలను ప్రారంభిస్తామని వెల్లడించారని తెలిపారు. ఇదే తరహాలో మన రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల్లోనూ ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి బాధితుల నుంచి బాండ్లు సేకరించాలని ముప్పాళ్ళ నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. రోజువారీ కూలీలు, నెలవారీ కంతుల రూపంలో సేకరించిన సొమ్మునంతా అగ్రిగోల్డ్‌ యాజమాన్యం వారి బంధువులు, బినామీల పేరిట ఆస్తులుగా మార్చి కోర్టు కేసుల నెపంతో కాలాన్ని వెళ్లదీస్తోందని ఆయన ఖండించారు. గత ప్రభుత్వ హయాంలో రూ.20 వేల లోపు డిపాజిట్లు ఉన్న 10.43 లక్షల మందికి మాత్రమే డబ్బులు చెల్లించారని, అంతకంటే ఎక్కువ మొత్తం ఉన్న బాధితుల సమస్యలు ఇంకా అలాగే ఉండిపోయాయన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు వెంకట శివ, ఏజెంట్‌ అండ్‌ కస్టమర్స్‌ నేతలు నాగార్జునరెడ్డి, సుబ్రమణ్యం, కృష్ణ, గోవిందు తదితరులు పాల్గొన్నారు.

సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు

ముప్పాళ్ళ నాగేశ్వరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement