ఎర్రగుంట్ల : ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం వల్ల ఏర్పడిన పశుగ్రాస కొరతను నివారించడానికి సామూహిక గడ్డి క్షేత్రాల పెంపకం ఎంతగానో దోహదపడుతుందని, దీనివల్ల పాడి రైతులకు అధిక లబ్ధి చేకూరుతుందని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ విజయలక్ష్మి అన్నారు. బుధవారం మండల పరిధిలోని తిప్పలూరు గ్రామ పరిధిలో భారతి సిమెంట్ ఫ్యాక్టరీ వారు కేటాయించిన 15 ఎకరాల పొలంలో ఉమ్మడిగా చేపట్టిన పశుగ్రాస పెంపక క్షేత్రాన్ని అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా జేడీ విజయలక్ష్మి మాట్లాడుతూ.. తిప్పలూరు గ్రామానికి చెందిన నిషాంత్‌రెడ్డి చొరవతో భూమిలేని 30 మంది పాడి రైతులను ఒక సంఘంగా చేర్చి ఈ సామూహిక సాగును ప్రారంభించినట్లు తెలిపారు. ఈ క్షేత్రం కోసం రైతులకు 350 కిలోల సీఎస్‌హెచ్–24 రకానికి చెందిన జొన్న విత్తనాలను పంపిణీ చేశామన్నారు. ప్రస్తుతం ఈ గ్రాసం కోతకు రావడంతో లబ్ధిదారులైన రైతులకు పంపిణీని ప్రారంభించామని చెప్పారు. మండలంలో సామూహిక గడ్డి క్షేత్రాలు పెంచుకోవడానికి ఆసక్తి గల రైతులు ముందుకు వస్తే వారికి ఉచితంగా విత్తనాలు అందిస్తామని జేడీ ప్రకటించారు. 75 శాతం రాయితీతో కూడిన పశుగ్రాస విత్తనాలు ఎర్రగుంట్ల ఏవీఎంలో అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో తమసీల్దార్ అమరేశ్వరీ, జమ్మలమడుగు సంచాలయలడు డాక్టరు వీరభ్రహ్మం, ఎర్రగుంట్ల పశుసంవర్దశాఖ సహయ సంచాలకుడు డాక్టర్ మునెయ్య భారతి సిమెంట్ ఫ్యాక్టరీ హెచ్‌ఆర్ మేనేజర్ భార్గవరెడ్డి, మండల వ్యవసాధికారి సుజనకుమారి, పోట్లదుర్తి పశువైద్యశాఖ డాక్టర్ వై జ్యోతి, చిలంకూరు పశువైద్యశాల డాక్టర్ మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


