అమ్మతోడు.. | - | Sakshi
Sakshi News home page

అమ్మతోడు..

Sep 30 2026 1:52 AM | Updated on Sep 30 2026 1:52 AM

● జమ్మలమడుగు మున్సిపల్‌ ఎన్నికలపై మళ్లీ డాంబికాలు!

● భూపేష్‌రెడ్డిని బద్నాం చేయడానికే ఈ ‘నోటిదూల’ సవాళ్లంటున్న విశ్లేషకులు!

● బెదిరింపు పర్వానికి ఎమ్మెల్యే ‘ఆది’ తెర..

మా జోలికొస్తే ‘ఆపరేషన్‌ సింధూర్‌’ చూపిస్తా!

● కూటమి జోలికొస్తే సినిమా షూటింగులే.. బహిరంగంగానే హెచ్చరికలు!

సాక్షి ప్రతినిధి, కడప: జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మళ్ళీ ‘టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌’ అయ్యారు. జమ్మలమడుగు మున్సిపల్‌ ఎన్నికల ముంగిట తన సొంత ఫ్యాక్షన్‌ నేపథ్యాన్ని తానే నెమరువేసుకుంటూ, మంగళవారం మళ్లీ నోరు జారి.. దేవగుడి రాజకీయాన్ని మరోసారి ఇరకాటంలోకి నెట్టేశారు. ‘వైఎస్సార్సీపీ వాళ్లకు చెబుతున్నా.. మీరు పాలెగాళ్లైతే జమ్మలమడుగు మున్సిపాలిటీలో ఒక్క కౌన్సిలర్‌ సీటు గెలుచుకున్నా మేము రాజకీయం చాలించుకుంటాం.. ఒక్కటే ఒక్కటి...’ అంటూ ఆయన గట్టి సవాల్‌ విసిరారు. దీంతో పక్కనే కూర్చున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవగుడి భూపేష్‌రెడ్డి సైతం ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఈమాట ఎమ్మెల్యే తనకు మాత్రమే ఆపాదించుకుని ఉంటే ఎవ్వరికీ అభ్యంతరం లేదు. ఎందుకంటే తను తరచూ ఇలాంటి డాంబికాలు పలకడం, మళ్లీ మాట తప్పి మడమ తిప్పి పలాయనం చిత్తగించడం పరిపాటే. కాగా, ఈసారి మొత్తం దేవగుడి కుటుంబాన్ని ఉద్దేశించి ‘మేము రాజకీయాలు మానుకుంటాం’అని సవాల్‌ విసరడంపైనే ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇపుడిపుడే రాజకీయంగా ఎదుగుతూ, భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్న భూపేష్‌రెడ్డి రాజకీయ జీవితాన్ని సైతం భ్రష్టు పట్టించడానికే ఆదినారాయణ రెడ్డి ఇలాంటి డాంబికాలు మాట్లాడి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

2005లోనూ ఇదే సీన్‌.. జైలు నుంచే గట్టి పంచ్‌!

ఆదిబాబుకు ఇలాంటి పదునైన సవాళ్లు విసిరి, ఆ తర్వాత ‘ఎస్‌.. స్కేప్‌’ అవ్వడం కొత్తేమీ కాదని జమ్మలమడుగు ఓటర్లు నవ్వుకుంటున్నారు. సరిగ్గా 21 ఏళ్ల క్రితం, ఇదే సెప్టెంబర్‌ (2005) నెలలో ఆదినారాయణ రెడ్డి ఇలాంటి సవాలే విసిరి ఘోరంగా అభాసుపాలయ్యారు. అప్పట్లో జమ్మలమడుగు మున్సిపాలిటీకి 20 వార్డులు ఉండేవి. 2005 మున్సిపల్‌ ఎన్నికల సమయంలో, ‘ప్రతిపక్షం కనుక ఇక్కడ మూడు వార్డులు గెలిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’ అంటూ అట్టహాసంగా ప్రకటించారు. వాస్తవానికి ఆదినారాయణరెడ్డి ప్రధాన ప్రత్యర్థి అయిన రామసుబ్బారెడ్డి ఆ సమయంలో చర్లపల్లి జైలులో ఉన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల బాధ్యతను రామసుబ్బారెడ్డి సతీమణి ఇందిరమ్మ ఒంటిచేత్తో చూసుకుంటూ ఉండేది. భర్త జైలులో ఉన్నా, తాము ప్రతిపక్షంలో ఉన్నా 20 వార్డులకూ తమ అభ్యర్థులతో పోటీ చేయించిన ఆమె.. కచ్చితంగా మూడు వార్డులను మాత్రమే గెలుచుకుని ఆదినారా యణరెడ్డిని నిలువునా ఇరకాటంలోకి నెట్టేసింది. అప్పట్లో ఆదినారాయణరెడ్డి నోటిదూల వల్ల ఆయన వర్గం ఏకంగా 17 సీట్లు గెలుచుకున్నా కూడా కనీసం ఒక్కటంటే ఒక్క సంబరం కూడా చేసుకోలేకపోయింది. కానీ, కేవలం మూడు సీట్లు గెలిచిన ప్రతిపక్షం మాత్రం ఆరోజు జమ్మలమడుగులో పెద్ద ఎత్తున పండగ చేసుకుంది. ఆ తర్వాత ఈయన గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసింది లేదు.. రాజకీయం మానుకుంది లేదని పరిశీలకులు దెప్పిపొడుస్తున్నారు.

ఇపుడు మళ్లీ అవే డాంబికాలే...

నాడు 20 వార్డులున్న జమ్మలమడుగు మున్సిపాలిటీ నేడు 32 వార్డులకు విస్తరించింది. మొత్తం 32 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి గట్టి అభ్యర్థులను బరిలో దించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి ఓసీ మహిళా రిజర్వు అయితే స్వయంగా రామసుబ్బారెడ్డి సతీమణి ఇందిరమ్మే మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా ఉండబోతున్నారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధిక కౌన్సిల్‌ స్థానాలను గెలుచుకోవడమే కాకుండా.. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ సీటును సైతం దక్కించుకోబోతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లుండి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆద్యంతం ఆసక్తికరంగా మారాయి. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న భూపేష్‌రెడ్డిని బద్నాం చేయడానికేనా ఇలాంటి పనికిరాని ప్రగల్భాలు మాట్లాడాడనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. అతని సొంత అభిప్రాయాన్ని మొత్తం కుటుంబానికంతా రుద్ది, డాంబికపు మాటలతో అన్నదమ్ములందరినీ ఇరకాటంలోకి నెట్టి, ఆ తర్వాత తమాషా చూడడం ఆయనకు అలవాటేనని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి

టాస్క్‌ఫోర్సు: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే పి.ఆదినారాయణరెడ్డి బెదిరింపుల పర్వానికి తెరలేపారు. మంగళవారం జమ్మలమడుగు పట్టణంలోని రిపబ్లిక్‌ క్లబ్బులో ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరంలో మంత్రి ఎస్‌.సవిత సమక్షంలోనే ఆది ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా దుమారం రేపుతోంది.

మాది సినిమా షూటింగ్‌ కాదు.. హిస్టరీ!

సమావేశంలో ఆదిబాబు మైక్‌ అందుకుని వైఎస్సార్‌సీపీని టార్గెట్‌ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘వాళ్ల మాదిరి మేము రీల్‌ తిప్పం.. ఇది సినిమా షూటింగ్‌ కాదు, రియల్‌. వాళ్లలా గ్రాఫిక్స్‌ చేయం, మాది నిజమైన గ్రాఫ్‌. మేము స్టోరీలు చెప్పం.. మాది గండికోట హిస్టరీ’ అంటూ చెప్పుకొచ్చారు. తాము ఫ్యాక్షనిజంలో నలిగిపోయామని, సొంత మనుషులను పోగొట్టుకున్నామని చెబుతూనే.. ‘మేము ఎవ్వరి జోలికి పోము.. కానీ మా కూటమి నాయకుల జోలికి, కార్యకర్తల జోలికి వస్తే మాత్రం కచ్చితంగా ఆపరేషన్‌ సింధూర్‌ ఉంటుంది, సినిమా చూపిస్తాం’ అంటూ భయానక వాతావరణాన్ని సృష్టించేలా మాట్లాడారు.

మళ్లీ అదే కౌన్సిలర్‌ సవాల్‌!

తాము ఇండ్లు ఇచ్చామని, చేనేతలకు పెన్షన్లు, ఆటోవారితో పాటు మత్స్యకారులకు ఎంతో సహాయం చేశామని చెప్తున్న ఆదిబాబు.. ‘మంచి చేస్తే ఓట్లేయరా.. మరి బెదిరింపులు ఎందుకు?’ అంటూ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. గతంలో జగన్‌కు బై–ఎలక్షన్‌లో లక్ష ఓట్ల మెజార్టీ తెచ్చానని గుర్తుచేస్తూ.. తనపై కోడికత్తి, వివేకానందరెడ్డి హత్య కేసులను అక్రమంగా పెట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. ఒక్క రేప్‌ కేసు తప్ప తనపై అన్ని కేసులు పెట్టేశారంటూ విచిత్ర వ్యాఖ్యలు చేశారు. జమ్మలమడుగు మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పాలెగాళ్లు కనుక ఒక్క కౌన్సిలర్‌ సీటు గెలిచినా తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్‌ విసిరారు. 2005 మున్సిపల్‌ ఎన్నికల్లో ఇలాగే 3 సీట్ల సవాల్‌ విసిరి దారుణంగా అభాసుపాలైన ఆది.. మళ్లీ ఇప్పుడు అదే పాత చింతకాయ పచ్చడి ప్రగల్భాలు పలుకుతుండటంపై జమ్మలమడుగు ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement