స్థానికఎన్నికల తరహాలో ఎస్‌ఎంసీ ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

స్థానికఎన్నికల తరహాలో ఎస్‌ఎంసీ ఎన్నికలు

Sep 30 2026 1:52 AM | Updated on Sep 30 2026 1:52 AM

● 2281 పాఠశాలకుగాను

1882 పాఠశాలల్లో నిర్వహణ

● బద్వేల్‌ నియోజకవర్గ వ్యాప్తంగా 352 పాఠశాలల్లో ఆగిన ఎన్నికలు

● 10 పాఠశాలల్లో కోరం లేక మరో 29 స్కూళ్లలో జీరో ఎన్‌రోల్‌తో నిలుపుదల

కడప ఎడ్యుకేషన్‌: ప్రశాంత వాతావరణంలో సజావుగా జరగాల్సిన స్కూల్‌ కమిటీ ఎన్నికల(ఎస్‌ఎంసీ)లు కూడా స్థానిక సంస్థల ఎన్నికలను తలపించాయి. జిల్లావ్యాప్తంగా ఒకట్రెండు చోట్లు చిన్నపాటి ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఎన్నికలను నిర్వహించారు.

● జిల్లావ్యాప్తంగా 2281 పాఠశాలల్లో మంగళవారం ఎస్‌ఎంసీ ఎన్నికలు జరగాల్సి ఉండగా 1882 పాఠశాలల్లోనే జరిగాయి. మిగతా 399 స్కూల్స్‌లో ఎన్నికలు జరగలేదు. ఇందులో బద్వేల్‌ నియోజవర్గ వ్యాప్తంగా 352 పాఠశాలలో ఎస్‌ఎంసీ ఎన్నికలు జరగలేదు. గిద్దలూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమావేశానికి బద్వేల్‌ నియోజక వర్గం నుంచి మహిళలు వెళ్లడమే ఇందుకు కారణం. బద్వేల్‌ డివిజన్‌ ఆర్‌డీవో ఎస్‌ఎంసీ ఎన్నికలు వాయిదా వేయాలని కలెక్టర్‌కు విన్నవించగా.. ఆయన ఉత్తర్వు మేరకు ఎన్నికలను వాయిదా వేసినట్లు తెలిసింది. ఈ విషయమై సమగ్రశిక్ష ఏపీసీ అనురాధను వివరణ కోరగా బద్వేల్‌ నియోజక వర్గం మొత్తం అక్టోబర్‌ 1వ తేదీ ఎన్నికలను నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారన్నారు.10 పాఠశాలల్లో మాత్రం కోరం లేక ఎన్నికలు జరగలేదు. అలాగే మరో 29 పాఠశాలలో జీరో ఎన్‌రోల్‌ మెంట్‌ ఉండటంతో ఆ పాఠశాలల్లో కూడా ఎన్నికలను నిర్వహించలేదు. అలాగే మరో 8 ఎయిడెడ్‌ స్కూల్స్‌ ఎన్నికలను నిర్వహించినా ఎస్‌ఎంసీ కమిటీ పేర్లను ప్రకటించేందుకు నిర్వాహకులు నిరాకరించనట్లు తెలిసింది.

ఖాజీపేట మండలంలో...

ఖాజీపేట మండలం దుంపలగట్టు ప్రాథమిక పాఠశాలలో ఎన్నికల నిర్వహణలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ మద్దతుదారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. అలాగే దుంపలగట్టు దళితవాడలో కూడా టీడీపీ నేతల ఘర్షణతో ఎస్‌ఎంసీ ఎన్నికలు వాయిదా పడ్డాయి.

ఒంటిమిట్టలో ఉపాధ్యాయుల అత్యుత్సాహం

● ఒంటిమిట్ట మండలంలో ఎస్‌ఎంసీ ఎన్నికలను ఆయా పాఠశాలలకు సంబంధించిన కొంత మంది ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా ఒంటిమిట్ట జెడ్పీహెచ్‌ఎస్‌లో జరిగిన ఎస్‌ఎంసీ ఎన్నికల్లో మొత్తం 15 మంది సభ్యుల పేర్లను ఎంపిక చేసినట్లు ధ్రువీకరించిన ఉపాధ్యాయులు.. సదరు ధ్రువీకరణ పత్రాల్లో సభ్యుల సంతకాలు కాక ముందే చైర్మన్‌ ఎన్నిక పూర్తి చేశారు.

● నిబంధనల ప్రకారం ఎస్‌ఎంసీ ఎన్నికల్లో చైర్మన్‌ని మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల లోపు ఎన్నుకోవాల్సి ఉండగా పెన్నపేరూరు జడ్పీహెచ్‌ఎస్‌లో, రాచగుడిపల్లి ఎంపీపీఎస్‌ లలో ఉదయం 10:30 గంటలకే చైర్మన్లను ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు సన్మానాలు చేసి, సామాజిక మాధ్యమాల్లోనూ పోస్ట్‌ చేయడం హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు అత్యుత్సాహాన్ని చూపుతుందని విమర్శలు వస్తున్నాయి.

ఎన్నికలు జరగని పాఠశాలల్లో...

జిల్లావ్యాప్తంగా వివిధ కారణాలతో ఎన్నికలు జరగకుండా వాయిదా పడిన 370 పాఠశాలల్లో తిరిగి అక్టోబర్‌ 1వ తేదీన ఎన్నికల నిర్వహణ ఉంటుందని డీఈఓ షేక్‌ షంషుద్దీన్‌, సమగ్రశిక్ష ఏపీసీ అనురాధ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement