కడప సెవెన్‌రోడ్స్ : రాష్ట్రంలో జరుగుతున్న దళితుల హత్యలపై రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం స్పందించడం లేదని, రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెబుతారని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు అన్నారు. ఏపీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్మపోరాట దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అగ్రకులాలకు చెందిన వ్యక్తులు హత్యలకు గురైన సందర్భంలో ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాలను వివిధ రూపాల్లో ఆదుకుంటోందన్నారు. సీఐ నాగరాజు వల్ల చనిపోయిన పేరుపోగు క్రాంతికుమార్ హత్యపై సీఎం ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని నిలదీశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 28 మంది దళితులు హత్యకు గురయ్యారన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. దళిత హత్య కేసులను వేగంగా విచారించేందుకు తక్షణమే ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హత్యకు గురైన దళితుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీల భూ సమస్యలు, ఉద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. దళిత హత్య కేసుల్లో న్యాయం చేయకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్రజలు తగిన సమాధానం చెబుతారని దాసరి సువర్ణ రాజు హెచ్చరించారు. దళితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్, గౌరవ అధ్యక్షులు వెంకటేశ్, కళాచైతన్య రాష్ట్ర అధ్యక్షులు విజయ్‌కుమార్, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు రామోజి ఇమ్మానియేల్, మాలమహాసేన జిల్లా ఉపాధ్యక్షులు సంపత్‌కుమార్, ఎమ్మార్పీఎస్ నాయకులు నాగసుబ్బరాయుడు, బుడ్డా శ్రీనివాసులు, ఓబులపతి తదితరులు పాల్గొన్నారు.
సమగ్ర విచారణ జరపాలి
కడప సెవెన్‌రోడ్స్ : రాష్ట్రంలో జరిగిన 27 మంది దళిత వ్యక్తుల హత్యలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గుర్రప్ప డిమాండ్ చేశారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నడుస్తున్న రెడ్‌బుక్ రాజ్యాంగం ఫలితంగానే హత్యలు జరుగుతున్నాయన్నారు. దళిత హత్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి మానుకోకపోతే సహించబోమన్నారు. ఈ కార్యక్రమంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది వేదిక రాష్ట్ర అధ్యక్షులు నారాయణ, హేతువాద సంఘం జిల్లా కార్యదర్శి సీఆర్‌వీ ప్రసాద్, ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి జయవర్దన్, ఆర్‌ఎస్‌పీ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు, పీఆర్‌వైఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర, ఏబీఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఓబయ్య, బాల వీరప్ప తదితరులు పాల్గొన్నారు.
ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు


