ఒంటిమిట్ట : మండల పరిధిలోని ఇబ్రహీంపేటలో విష ద్రావణంతాగి నక్కల రామయ్య(45) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు..ఇబ్రహీంపేట ఎస్సీ కాలనీ కి చెందిన నక్కల రామయ్య ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఏం జరిగిదో ఏమో తెలియదు ఆదివారం ఉదయం 7:30 గంటల సమయంలో ఎస్సీ కాలనీలోని ఓ ప్రదేశంలో మద్యంలో విషద్రావణం కలుపుకుని తాగడంతో తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. గమనించిన స్థానికులు రామయ్యను కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. రామయ్యకు భార్య లక్ష్మీదేవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహమైంది. భార్య లక్ష్మీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విచారిస్తున్నారు.
భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని భర్త..
ప్రొద్దుటూరు క్రైం : భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని కలత చెంది.. భర్త కృష్ణయ్య (40) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రొద్దుటూరులోని శ్రీనివాసనగర్‌లో చోటు చేసుకుంది. టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీనివాసనగర్‌లోని బాలాజీ గ్యాస్ ఏజెన్సీ ఎదురుగా ఉన్న పెంచలయ్య హమాలీ పని చేసుకుని జీవనం సాగిస్తుంటాడు. కుటుంబ కలహాల కారణంగా అతని భార్య ఈ నెల 26న ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన కృష్ణయ్య సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న టూ టౌన్ ఎస్‌ఐ మహబూబ్‌బాషా సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు, మృతుడి తల్లి చిన్నక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
అప్పుల బాధతో..
కడప అర్బన్ : కడపలోని రిమ్స్ సీఎస్ పరిధిలో వికలాంగుల కాలనీకి చెందిన వెంకటేష్ (33) అనే వ్యక్తి మద్యం సేవించి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని సోమవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు రిమ్స్ పీఎస్ ఎస్‌ఐ లక్ష్మినారాయణ తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు ఆవుల వెంకటేష్ ప్రవేట్ వాహనాల డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య శివమ్మ ఇంట్లోనే ఉంటుంది. వెంకటేష్ అప్పులు చేసి, వాటిని తీర్చలేక తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఊరి వేసుకొని ఆత్మ హత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతుడి తల్లి రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
రాజుపాళెం : మండలంలోని తొండలదిన్నెలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 9 మంది రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల హెచ్‌ఎం లక్ష్మినారాయణ రెడ్డి, పీడీ జిలాన్ బాషా తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ కడపలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్ టేబుల్ టెన్నిస్ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో రాణించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని తెలిపారు. అండర్–14 బాలికల విభాగంలో ఎన్.చురిత, బి.ప్రశాంతి, బాలుర విభాగంలో టి.సందీప్, ఏ.సుశాంత్, అండర్–17 బాలికల విభాగంలో బి.పోలమ్మ, ఎం.భాను తేజ, బాలుర విభాగంలో సుభాష్, గంగ జనార్ధన్, జితేంద్రలు ఎంపికయ్యారన్నారు.వారిని హెచ్‌ఎం, పీడీ, విద్యాకమిటీ చైర్మన్ షరీఫ్, ఉపాధ్యాయులు అభినందిచారు.


