వేముల : తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్ట్ (యూసీఐఎల్) పరిసర గ్రామాల్లో కాలుష్యం కారణంగా ప్రజలు క్యాన్సర్, క్లస్టర్ వ్యాధుల బారిన పడుతున్నారని, బాధితులందరికీ కంపెనీ తక్షణమే క్యాన్సర్ పరీక్షలు, వ్యాక్సినేషన్ నిర్వహించాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) రాష్ట్ర మాజీ డైరెక్టర్ మరకా శివకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ఆయన యూసీఐఎల్ ఉద్యోగులతో కలిసి ప్రాజెక్టు జనరల్ మేనేజర్ సుమన్ సర్కార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా శివకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కంపెనీ పరిసర ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత అధికంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతోపాటు యూసీఐఎల్‌లో పనిచేస్తూ అనారోగ్య కారణాలతో సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను జీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆసుపత్రి యాజమాన్యం ఏసీ ఛార్జీలు, రూమ్ రెంట్లు కట్టాలని ఉద్యోగులపై ఒత్తిడి తెస్తోందని, కనీసం జనరల్ రూమ్‌లు కూడా కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఉద్యోగుల రూమ్ రెంట్లను కూడా కంపెనీయే చెల్లించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో యూసీఐఎల్ ఉద్యోగులు బి.రాములయ్య, బి.రవికుమార్, వెంకటకృష్ణ, వై.నారాయణస్వామి, వై.శివ, ఎ.శ్రీనివాసులు, బి.గంగిరెడ్డి, వై.రవి, తదితరులు పాల్గొన్నారు.


