కడప ఎడ్యుకేషన్ : కడప ప్రభుత్వ పురుషుల (ఆర్ట్స్) కళాశాలలో సోమవారం ‘లింగ నిర్ధారణ పరీక్షలను నిలిపివేసి, ఆడపిల్లలను రక్షించాలి’అనే అంశంతోపాటు పీసీ అండ్ పీఎన్‌డీటీ చట్టంపై అవగాహన కల్పిస్తూ జిల్లాస్థాయి లఘు చిత్రాల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నుంచి విద్యార్థులు రూపొందించిన మొత్తం 11 లఘు చిత్రాలను ప్రదర్శించారు. (కడప ఆర్ట్స్ కళాశాల–6, పులివెందుల–2, పెండ్లిమర్రి–1, పోరుమామిళ్ల–1, రాజంపేట–1). పీసీ అండ్ పీఎన్‌డీటీ బృంద సభ్యులు భారతి, ప్రసన్నలత, భాస్కర్, పాలేశ్వర్‌లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి.. సామాజిక సందేశం, చిత్రీకరణ, సృజనాత్మకత ఆధారంగా లఘుచిత్రాలను పరిశీలించారు.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె. వెంకట లక్ష్మి మాట్లాడుతూ, ఆడపిల్లలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని, వారికి సమాన అవకాశాలు ఇచ్చినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఈ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రథమ బహుమతి రూ.30,000, ద్వితీయ బహుమతి రూ.20,000, తృతీయ బహుమతి రూ.10,000 నగదు పురస్కారాలను అందజేయనున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.


