ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం కడపకు చెందిన వైవీ నాయుడు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు పంపిణీ చేశారు. కళాశాలలో ద్వితీయ, చివరి సంవత్సరం చదువుతున్న 48 మంది మెరిట్ విద్యార్థులకు రూ.2లక్షల విలువైన స్కాలర్‌షిప్‌లను దివంగత వైవీ నాయుడు కుమారులు వినయ్‌కుమార్, డాక్టర్ రామసంజయ్, కోడలు సునీత, మనుమడు సాయివేణుగోపాల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ తండ్రి వైవీ నాయుడు ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతిగా పనిచేశారన్నారు. ఈ కళాశాలతో తమ కుటుంబానికి ఉన్న అనుంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ పాలెం గుర్తుమూర్తి రెడ్డి మాట్లాడుతూ వైవీ నాయుడు చారిటబుల్ ట్రస్టు ద్వారా రూ.2లక్షల విలువైన స్కాలర్‌షిప్‌లను 28 మంది ప్రతిభా విద్యార్థులకు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.


