వన్యప్రాణుల చర్మాల ముఠా గుట్టురట్టు | - | Sakshi
Sakshi News home page

వన్యప్రాణుల చర్మాల ముఠా గుట్టురట్టు

Sep 28 2026 1:17 AM | Updated on Sep 28 2026 1:17 AM

వన్యప్రాణుల చర్మాల ముఠా గుట్టురట్టు

ప్రొద్దుటూరు క్రైం : వన్యప్రాణుల చర్మాలను అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టును అటవీశాఖ అధికారులు రట్టు చేశారు. వైఎస్సార్‌ కడప జిల్లా మైదుకూరు పట్టణంలోని బద్వేల్‌ రోడ్డులో శాంతినికేతన్‌ స్కూల్‌ వెనుక ఉన్న చౌడేశ్వరినగర్‌లోని ఓ ఇంటిపై శనివారం అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా చుక్కల దుప్పి చర్మంతో పాటు ఐదు నకిలీ పులి చర్మాలు, 23 నకిలీ పులిగోర్లు, మూడు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. కేసు వివరాలను ఆదివారం సాయంత్రం ప్రొద్దుటూరులోని అట వీ శాఖ కార్యాలయంలో కడప డీఎఫ్‌ఓ రాజశేఖర్‌బాబు మీడియాకు వెల్లడించారు. కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి ఉర్దూలో ఫోన్‌ చేసి మైదుకూరు పరిధిలో వన్యప్రాణుల చర్మాలను విక్రయించే ముఠా కార్యకలాపాలపై అటవీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అధికారులు సిబ్బందిని అప్రమత్తం చేసి బద్వే ల్‌ ఎఫ్‌ఆర్‌ఓ నయీంఆలీ, ప్రొద్దుటూరు ఎఫ్‌ఆర్‌ఓ హేమాంజలి ఆధ్వర్యంలో ప్రత్యేక ఆపరేషన్‌ బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితులు పులి చర్మాలు, గోర్లతో రాష్ట్ర సరిహద్దులోకి ప్రవేశించినప్పటి నుంచి అటవీశాఖ అధికారులు వారిని అనుసరించారు. అనంతరం మైదుకూరులోని ఓ ఇంట్లోకి వెళ్లి చర్చిస్తున్న సమయంలో అధికారులు దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. దాడుల్లో మైదుకూరుకు చెందిన మడక ప్రసాద్‌, అట్లూరు మండలంలోని రంగంపల్లికి చెందిన కాటాదాసరి వెంకటయ్య, కర్నాటక రాష్ట్రంలోని గౌరీపురకు చెందిన గొట్టిబోయిన ప్రసాద్‌లను అరెస్ట్‌ చేశారు. కాగా మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు డీఎఫ్‌ఓ తెలిపారు.

నకిలీ చర్మాలతో అక్రమ దందా చేయాలని..

అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న ఆరు చర్మాల్లో ఒకటి చుక్కల దుప్పి చర్మం కాగా, మిగిలిన ఐదు చర్మాలు నకిలీవని ప్రాథమిక పరిశీలనలో తేలినట్లు డీఎఫ్‌ఓ తెలిపారు. కుక్కలు లేదా గేదెల చర్మాలను తీసుకొని వాటికి ఆర్టిస్టులతో పులి చారలు వేయించి నకిలీ చర్మాలుగా తయారు చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 23 గోర్లు కూడా నకిలీవిగా తేలినట్లు తెలిపారు. అయితే పూర్తి నిర్ధారణ కోసం చర్మాలు, గోర్లను ల్యాబొరేటరీకి పంపిస్తున్నట్లు వెల్లడించారు.

వన్యప్రాణుల చర్మాల అక్రమ రవాణా వ్యవహారంలో కడపలో లింకులు

ఈ వ్యవహారానికి సంబంధించిన లింకులు కడపలోనూ ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని డీఎఫ్‌ఓ రాజశేఖర్‌బాబు తెలిపారు. ముఠాతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులను కూడా గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. వన్యప్రాణుల చర్మాలు, ఇతర అవయవాలు అక్రమంగా కలిగి ఉండటం, రవాణా చేయడం, విక్రయించడం, కొనుగోలు చేయడం చట్టరిత్యా నేరమని డీఎఫ్‌ఓ స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన సబ్‌డీఎఫ్‌ఓ సంకేత్‌ సునీల్‌ గరుడ్‌, బద్వేల్‌ ఎఫ్‌ఆర్‌ఓ నయీంఆలీ, ప్రొద్దుటూరు ఎఫ్‌ఆర్‌ఓ హేమాంజలితో పాటు ఎఫ్‌ఎస్‌ఓ రవిచంద్ర, ఎఫ్‌బీఓలు హరినాథ్‌రాజు, కబీరు, సుదర్శన్‌, బ్రహ్మయ్య, రమాదేవి, సుంకయ్యలను డీఎఫ్‌ఓ అభినందించారు.

మైదుకూరులో ముగ్గురు అరెస్ట్‌..

ఆరు చర్మాలు, 23 గోర్లు స్వాఽధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement