కడప కోటిరెడ్డిసర్కిల్ : ఆర్టీసీ సంస్థను ప్రైవేటుపరంచేసే చర్యలను ప్రభుత్వంవిరమించుకోవాలని ఏపీ పీటీడీ (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు డిమాండ్ చేశారు. ఆదివారం కడప ఆర్టీసీ డీపీటీఓ కార్యాలయం వద్దనున్న కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా అధ్యక్షుడు జి. బోసుబాబు అధ్యక్షతన, జిల్లా కార్యదర్శి ఏ.రామమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈయు జిల్లా విస్తృతస్థాయి కౌన్సిల్ సమావేశంలో పలిశెట్టి దామోదరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘సీ్త్రశక్తి’పథకంతో భారీగా పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీకి తక్షణమే 4 వేల కొత్త బస్సులు సమకూర్చాలని, ఖాళీగా ఉన్న సుమారు 15 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. అలాగే ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా ఎలక్ట్రిక్ బస్సులను నిర్వహించే విధానాన్ని విరమించుకొని, ఆర్టీసీయే బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందితో నిర్వహించాలని కోరారు. ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల విధానంపై ప్రభుత్వం మళ్లీ ముందుకు వెళితే ఉద్యోగ సంఘాల జేఏసీగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. మూసివేసిన విద్యాధరపురం, గుంటూరు–2, నెల్లూరు–2, మంగళం డిపోలను ఆర్టీసీ జేఏసీకి ఇచ్చిన హామీ మేరకు వెంటనే పునఃప్రారంభించాలని కోరారు. కడప జోన్ జోనల్ అధ్యక్షుడు పి.ఎస్. ఖాన్, కడప జోన్ జోనల్ కార్యదర్శి ఎన్.రాజశేఖర్, నాన్ ఆపరేషన్ యూనిట్ నాయకులు రంగనాధ్, అంకిరెడ్డి, రావినాయక్, సుబ్బారెడ్డి, పుల్లన్న, సుబ్బన్న జోనల్ కమిటీ సభ్యులు పీఎన్‌పీ రెడ్డి, మోహన్ రావు, వైపీఎన్ రెడ్డి, సీఅర్‌ఎల్ రెడ్డి, జిల్లా నాయకులు మల్లికార్జున, అర్‌బీఎస్ మణ్యం, శివ, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షులు దామోదరరావు సమక్షంలో ప్రొద్దుటూరు డిపో ఎన్‌ఎంయూ నుంచి 8 మంది సభ్యులు, కడప డిపో నుండి 3 సభ్యులు, జమ్మలమడుగు నుండి ఒకరు పులివెందుల నుండి ఒకరు మొత్తం 13 మంది సభ్యులు ఎంప్లాయీస్ యూనియన్ లో చేరారు.


