కడప ఎడ్యుకేషన్: విద్యార్థి దశ నుంచే వారిలో శాసీ్త్రయ ఆలోచన, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాలని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ పేర్కొన్నారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కడప బాలాజీనగర్‌లోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు విజయవంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 20 మండలాల నుంచి దాదాపు 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు తమ శాసీ్త్రయ పరిజ్ఞానం, తార్కిక ఆలోచన, పరిశీలనా సామర్థ్యాన్ని ప్రదర్శించారు. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో మైలవరం ఏపీఆర్‌ఎస్ (గర్‌ల్స్) పాఠశాలకు చెందిన ఏ. స్వరూప, డి. వెంకట శ్రావణి, ఐ. ప్రదీష విజేతలుగా నిలిచి రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలకు ఎంపికయ్యారు. ప్రైవేట్ పాఠశాలల విభాగంలో ప్రొద్దుటూరు వైఎంఆర్‌కాలనీ గౌతమ్ హైస్కూల్‌కు చెందిన కే. హర్షిణిశ్రీ, వి. నేహ, ఏ. సతీష్ రెడ్డి విజేతలుగా నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జేవీవీ నాయకులు సమీర్ బాషా, బాల బయన్న చేసిన మ్యాజిక్ అంశాలు పలువురిని ఆకట్టుకున్నాయి.కార్యక్రమంలో ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ వీర సుదర్శన్ రెడ్డి, మాజీ డిప్యూటి ఈఓ నాగమునిరెడ్డి, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు రాజశేఖర్, రాహుల్, బాలు గారి వెంకటసుబ్బయ్య, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్ బాబు జిల్లా అధ్యక్షుడు సమీర్ బాష, జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాం, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.


