చిన్న వయసు.. పెద్ద మనసు | - | Sakshi
Sakshi News home page

చిన్న వయసు.. పెద్ద మనసు

Sep 27 2026 1:34 AM | Updated on Sep 27 2026 1:34 AM

– చిన్నారుల నిజాయితీకి పోలీసుల అభినందన

ప్రొద్దుటూరు క్రైం : రోడ్డుపై దొరికిన పర్సును సొంతం చేసుకోకుండా పోలీసులకు అప్పగించి ముగ్గురు పాఠశాలల విద్యార్థులు నిజాయితీ చాటుకున్నారు. ప్రొద్దుటూరు పట్టణంలోని గవిని సర్కిల్‌ వద్ద శనివారం పర్సు రోడ్డుపై పడి ఉండటాన్ని ఆదర్శకాలనీకి చెందిన విద్యార్థులు రాకేష్‌ (13) నవదీప్‌ (12), శుభం (12) గమనించారు. వెంటనే పర్సును తీసుకొని ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డికి అప్పగించారు. ఎస్‌ఐ పర్సును పరిశీలించగా ఆదర్శకాలనీకి చెందిన ఇల్లూరు రామచంద్రకు సంబంధించిన ఆధార్‌కార్డు అందులో ఉన్నట్లు గుర్తించారు. పర్సులో రూ. 720 నగదుతో పాటు కొన్ని వస్తువులు ఉన్నాయి. దీంతో పోలీసులు పర్సు యజమానిని గుర్తించి అప్పగించారు. చిన్న వయసులోనే బాధ్యతాయుతంగా వ్యవహరించి, దొరికిన సొమ్మును పోలీసులకు అప్పగించిన విద్యార్థుల నిజాయితీకి వన్‌టౌన్‌ సీఐ టీవీ కొండారెడ్డి, ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి ఫిదా అయ్యారు. చిన్నారుల నిజాయితీ, పెద్ద మనసును సీఐ. ఎస్‌ఐలు అభినందించారు. పిల్లల్లో చిన్ననాటి నుంచే నిజాయితీ, బాధ్యతాయుతమైన ఆలోచనా విధానాన్ని పెంపొందిస్తున్న తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు నేర్పుతున్న ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement