పోలీసులంటే భయం కాదు.. ప్రజలకు భరోసా | - | Sakshi
Sakshi News home page

పోలీసులంటే భయం కాదు.. ప్రజలకు భరోసా

Sep 27 2026 1:34 AM | Updated on Sep 27 2026 1:34 AM

సిద్దవటం : పోలీసు విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, ధైర్యం, మానవత్వం ఎంతో కీలకం. పోలీసు యూనిఫాం ప్రజలకు భరోసా కల్పించేలా పనిచేయాలి. పోలీసులంటే భయం కాదు.. ప్రజలకు భరోసా అనే భావన ప్రజల్లో కలగాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, వైఎస్సార్‌ కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎస్‌. సవిత నూతన పోలీసు కానిస్టేబుళ్లకు పిలుపునిచ్చారు. భాకరాపేటలోని ఏపీఎస్పీ 11వ బెటాలియన్‌ పోలీసు పరేడ్‌ మైదానంలో శనివారం 521 మంది నూతనంగా శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసు కానిస్టేబుళ్ల దీక్షాంత్‌ పరేడ్‌ ఘనంగా నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత హాజరుకాగా, జిల్లా కలెక్టర్‌ డా. శ్రీధర్‌ చెరుకూరి, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల నుంచి మంత్రి గౌరవ వందనం స్వీకరించారు. ఈ దీక్షాంత్‌ పరేడ్‌ కార్యక్రమంలో తొమ్మిది నెలల ప్రాథమిక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. వీరిలో కడప పోలీసు శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన 194 మంది సివిల్‌ ఎస్‌సీటీపీసీలు, 11వ బెటాలియన్‌కు చెందిన 327 మంది ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు ఉన్నారు.

పోలీసు వ్యవస్థకు కానిస్టేబుళ్లే వెన్నెముక

పోలీసు వ్యవస్థకు కానిస్టేబుళ్లే వెన్నెముక అని మంత్రి సవిత అన్నారు. దీక్షాంత్‌ పరేడ్‌ కేవలం ఒక పరేడ్‌ మాత్రమే కాదు.. శిక్షణార్థి నుంచి బాధ్యతాయుతమైన పోలీసు సిబ్బందిగా మారే కీలక ఘట్టం అన్నారు. క్రమశిక్షణ, సమన్వయం, ఆత్మవిశ్వాసం, విధి పట్ల అంకితభావాన్ని చాటిన నూతన కానిస్టేబుళ్లు ఇకపై ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించనున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతోపాటు కొత్త చట్టాలపై నిరంతరం అవగాహన పెంచుకోవాలని సూచించారు.

యూనిఫాం గౌరవంతో పాటు

బాధ్యతను ఇస్తుంది

నూతన కానిస్టేబుళ్లకు దీక్షాంత్‌ పరేడ్‌ ఒక కొత్త బాధ్యతాయుతమైన ప్రయాణానికి శ్రీకారం చుడుతుందని జిల్లా కలెక్టర్‌ డా. శ్రీధర్‌ చెరుకూరి అన్నారు. తొమ్మిది నెలల కఠిన శిక్షణ అనంతరం నేడు ప్రజాసేవలోకి అడుగుపెడుతున్న ప్రతి కానిస్టేబుల్‌ తన విధి పట్ల అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ‘పోలీసు యూనిఫాం గౌరవాన్ని మాత్రమే కాదు.. గొప్ప బాధ్యతను కూడా ఇస్తుందన్నారు. పోలీసుశాఖపై నమ్మకం, రక్షణ, సాయం చేస్తారని మీపై పెట్టుకున్న విశ్వాసాన్ని వమ్ము చేయకుండా.. సమాజ సేవ చేయడానికి.. ప్రభుత్వం మీకందిస్తున్న గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలి

జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ మాట్లాడుతూ 9 నెలల శిక్షణ పూర్తి చేసుకుని పోలీసు విధుల్లోకి అడుగుపెడుతున్న నూతన కానిస్టేబుళ్లు శిక్షణలో నేర్చుకున్న క్రమశిక్షణ, సమయపాలన, శారీరక దారుఢ్యం, విధి నిర్వహణ నైపుణ్యాలను సేవలో కొనసాగించాలని సూచించారు. ‘ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ప్రధాన బాధ్యత అన్నారు. పోలీసు యూనిఫారం అనేది కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదని ప్రతి పరిస్థితిలో సంయమనంతో వ్యవహరిస్తూ చట్టాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయాలన్నారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరించి వారి విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలన్నారు.

ప్రతిభ కనబర్చిన వారికి పురస్కారాలు..

దీక్షాంత్‌ పరేడ్‌ సందర్భంగా శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లకు మంత్రి సవిత, కలెక్టర్‌ డా. శ్రీధర్‌ చెరుకూరి, ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ పురస్కారాలు అందజేసి అభినందించారు. అనంతరం నూతన కానిస్టేబుళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో 11వ బెటాలియన్‌ కమాండెంట్‌ ఆనంద్‌ రెడ్డి, కడప డీటీసీ డీఎస్పీ అబ్దుల్‌ కరీం, బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ రాజశేఖర్‌, పోలీసు అధికారులు, జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నత అధికారులు, వివిధ కేటగిరీలకు చెందిన పోలీసు, బెటాలియన్‌ సిబ్బంది, శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు, వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ పిఆర్వో వెంకట్‌ యాదవ్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించి కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా సాగించారు.

క్రమశిక్షణ, నిజాయితీతో విధులు

నిర్వహించాలి

దీక్షాంత్‌ పరేడ్‌ కార్యక్రమంలో

జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎస్‌. సవిత

శిక్షణ పూర్తి చేసుకున్న 521 మంది నూతన కానిస్టేబుళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement