● రికార్డులు లేని 23 వాహనాలు స్వాధీనం
● రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లకు కౌన్సెలింగ్
మైదుకూరు : మైదుకూరులో పోలీసులు శనివారం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని గాంధీ రోడ్డు, కొత్తకొట్టాలు, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో అర్బన్ సీఐ కె.రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో రికార్డులు లేని 23 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులు, పాత నేరస్తుల ఇళ్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అనుమానిత ప్రాంతాల్లో వేటకొడవళ్లు, బాంబులు, నిషేధిత ఆయుధాల కోసం గాలించారు. వాహనాల రికార్డులను పరిశీలించారు. తక్కువ ధరకు ఇస్తున్నారని రికార్డులు లేని వాహనాలు కొనుగోలు చేయవద్దని, కొనుగోలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ రమణారెడ్డి హెచ్చరించారు. రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్లకు, సస్పెక్ట్ షీటర్లకు కౌనెసలింగ్ నిర్వహించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి గొడవలకు పాల్పడకూడదన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి లేదా అనుమానితుల సమాచారాన్ని డయల్ 112 ద్వారా పోలీసులకు సమాచారమివ్వాలని సూచించారు. తనిఖీల్లో అర్బన్ ఎస్‌ఐలు కె.చిరంజీవి, కత్తి వెంకటరమణ, సిబ్బంది పాల్గొన్నారు.


