● చినుకురాలక.. ముందుకు ‘సాగు’క.. ● జూన్, జూలై నెలల్లో లోటు వర్షపాతం ● ఇప్పటికీ 15 శాతమే సాగు
కడప అగ్రికల్చర్: కరువు కమ్ముకొస్తోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలవుతున్నా నేటికి పంటలసాగు అనుకున్న మేర ముందుకు సాగడం లేదు. ఇప్పటివరకు జిల్లాలో 15.5 శాతం పంటలే సాగయ్యా యి. మరో రెండు నెలల్లో సాగుకు గడువు కూడా ముగియనుంది. ఈ లోపు లక్ష్యం మేరకు పంటలు సాగయ్యే పరిస్థితి కనుచూపు మేరలో కనిపించడం లేదు.
ఇప్పటికి 15 శాతమే సాగు...
ఈ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సాధారణ సాగు 76,496 హెక్టార్లలో పంటలసాగు కావాల్సి ఉంది. ఇప్పటికీ కేవలం 11833 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. అంటే ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడువు ముగుస్తున్నా నేటికి 15.5 శాతం మేరే పంటలు సాగవడం కలవరపరుస్తోంది. గతేడాది ఈ పాటికి జిల్లాలో 12,191 హెక్టార్లలో పంటలసాగయ్యాయి. ఈ ఏడాది 358 హెక్టార్లలో పంటలసాగు తగ్గింది. ఇక జూలైలో సాధారణ వర్షపాతం 96.7 మి.మీ వర్షం కురువాల్సి ఉండగా ఇప్పటికి కేవ లం 23.1 శాతం మాత్రమే వర్షం కురిసింది. అలాగే జూన్ నెలలో కూడా 68.2 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా 50.3 మి.మీ మాత్రమే వర్షం కురిసింది.
రైతుల్లో ఆందోళన...
జూన్‌లో ముందస్తుగా కురిసిన వర్షాల ఆధారంగా జిల్లాలో పంటలు సాగు చేసిన రైతుల్లో ఆందోళన నెల కొంది. జిల్లావ్యాప్తంగా వర్షధారంతో 5618 హెక్టార్లలో పత్తి, వేరుశనగ, మినుము, కంది, పెసలు, సజ్జ. మొక్కజొన్న, కొర్ర పంటలు సాగయ్యాయి. ఈ పంటలు సాగు చేసిన రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరో పదిహేను, ఇరవై రోజుల్లో చినుకు జాడ లేకుంటే ఆ పంటలన్నీ ఎండిపోయే ప్రమాదం నెలకొంది.
బోరుబావులున్నా...
బోరువెల్స్ అధారంగా జిల్లాలో 6220 హెక్టార్లలో వరితోపాటు పలు ఆరుతడి పంటలు సాగు చేశారు. ఈ పంటలు సాగు చేసిన రైతుల్లోనూ అలజడి మొదలైంది. ఇప్పటివరకు అరకొర వర్షాలు తప్ప పూర్థి స్థాయిలో పదునైన వర్షాలు కురవలేదు. దీనికితోడు విపరీతమైన గాలులు వీస్తున్నాయి. దీంతో భూమిలో ఉండే అరకొర తేమ కూడా ఆవిరైపోతోంది. దీంతో పలు ప్రాంతాల్లోని బోర్లలో నీరు తగ్గుముఖం పట్టా యి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో నెలలోపు బోర్లలో కూడా నీరు తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


