భారీ చోరీ కేసు ఛేదింపు | - | Sakshi
Sakshi News home page

భారీ చోరీ కేసు ఛేదింపు

Aug 2 2026 1:10 AM | Updated on Aug 2 2026 1:10 AM

సాంకేతిక ఆధారాలతో 48 గంటల్లోనే నిందితుడి అరెస్ట్‌

రూ.75 లక్షల బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం

కడప అర్బన్‌ : ‘నేరస్తుడు ఎంత తెలివిగా వ్యవహరించినా, సాంకేతిక పరిజ్ఞానం ముందు తప్పించుకోలేడు’ అనే విషయాన్ని జిల్లా పోలీసులు మరోసారి నిరూపించారు. భారీ చోరీ కేసును కేవలం 48 గంటల్లోనే ఛేదించారు. జూలై 30న ఉదయం సుమారు 6.30 గంటలకు కడప నగరంలోని విజయదుర్గా కాలనీలో గల శ్రీ విజయదుర్గా రెసిడెన్సీ ప్లాట్‌ నంబర్‌ 314లో నివాసముంటున్న సీనియర్‌ సిటిజన్‌ కుప్పం లీలావతమ్మ డయల్‌–100కు ఫోన్‌ చేసి, తమ నివాసంలోని తాళాలు పగులగొట్టి ఇంటిలో భద్రపరిచిన సుమారు 66 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని ఫిర్యాదు చేశారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. కడప తాలూకా పోలీసులు, ఫింగర్‌ ప్రింట్‌ నిపుణులు, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు, సైబర్‌ క్రైమ్‌ బృందాన్ని వెంటనే సంఘటన స్థలానికి పంపించారు. ఘటనా స్థలాన్ని శాసీ్త్రయంగా పరిశీలించిన అనంతరం అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా గమనించారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ యువకుడిని గుర్తించారు. ఆ యువకుడి ఫొటోను ఫిర్యాదిదారుకు చూపించగా, అతను తన మనవడు కుప్పం శంకర్నాథ్‌ అని నిర్ధారణ చేశారు. దీంతో జిల్లా ఎస్పీ స్వయంగా కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తూ, సైబర్‌ క్రైమ్‌ బృందం ద్వారా నిందితుడి కదలికలను సాంకేతికంగా విశ్లేషించారు. నిందితుడు హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించిన వెంటనే ప్రత్యేక పోలీసు బృందాలను అక్కడికి పంపించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని శాసీ్త్రయ పద్ధతిలో విచారణ చేయగా, అతను నేరాన్ని అంగీకరించాడు.

నేరానికి దారి తీసిన నేపథ్యం

దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, నిందితుడి కుటుంబానికి, అతని నానమ్మకు మధ్య కొంతకాలంగా ఆస్తి వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ వివాదాల కారణంగా కుటుంబంలో ఏర్పడిన విభేదాలు, వ్యక్తిగత అసంతృప్తి నేపథ్యంలో నిందితుడు చోరీకి పాల్పడినట్లు అంగీకరించాడు. నానమ్మ హైదరాబాద్‌కు వెళ్లిన విషయం తెలుసుకున్న నిందితుడు జూలై 29న హైదరాబాద్‌ నుంచి కడపకు చేరుకుని, ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. అనంతరం అల్మారాలో భద్రపరిచిన 664 గ్రాముల బంగారు ఆభరణాలు, 700 గ్రాముల వెండి వస్తువులు అపహరించి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లినట్లు విచారణలో వెల్లడైంది.

చోరీ సొత్తు స్వాధీనం

నిందితుడి వద్ద నుంచి 664 గ్రాముల బంగారు ఆభరణాలు, 700 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.75 లక్షలుగా అంచనా వేశారు. కడప ఎస్‌డీపీఓ ఆధ్వర్యంలో కేసు ఛేదించిన కడప తాలూకా సీఐ రాజేంద్రనాథ్‌ యాదవ్‌, ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీ, హెడ్‌ కానిస్టేబుళ్లు సాగర్‌, రవికుమార్‌, కానిస్టేబుళ్లు సుబ్బయ్య, రఘు, ఫయాజ్‌, సైబర్‌ క్రైమ్‌ బృందం, ఫింగర్‌ ప్రింట్‌ నిపుణులు, డాగ్‌ స్క్వాడ్‌ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి, వారి సమన్వయంతో కూడిన పనితీరును ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement