బ్లేడుతో దాడి కేసులో ఇద్దరు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

బ్లేడుతో దాడి కేసులో ఇద్దరు అరెస్ట్‌

Aug 2 2026 1:10 AM | Updated on Aug 2 2026 1:10 AM

వేంపల్లె : వేంపల్లెలోని రాజీవ్‌ కాలనీలో జరిగిన బ్లేడుతో దాడి కేసులో సాయికిరణ్‌, ఆంజనేయులును అరెస్టు చేసినట్లు సీఐ నరసింహులు తెలిపారు. కూలీ పనికి రానందుకు వేంపల్లి శ్రీరామ్‌ నగర్‌ కాలనీకి చెందిన మేసీ్త్రలు వెంకటరమణ, నరసింహులు గత నెల 30వ తేదీన తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఇంటి దగ్గరికి వెళ్లగా.. ఇరివురి మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ దాడిలో సాయి కిరణ్‌, ఆంజనేయులు బ్లేడుతో దాడి చేయడంతో వెంకటరమణ, నరసింహులుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేసి సాయికిరణ్‌, ఆంజనేయులును అరెస్టు చేసి శనివారం పులివెందుల కోర్టుకు హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు.

ఆర్టీసీ కడపజోన్‌ ఈడీగా కిశోర్‌

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : ఏపీఎస్‌ ఆర్టీసీ కడపజోన్‌ ఈడీగా ఆర్‌ఆర్‌కే కిశోర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఈడీ (అడ్మిన్‌) ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు కడప ఈడీగా పనిచేస్తున్న ఎస్‌టీపీ రాఘవకుమార్‌ విజయవాడలోని ప్రధాన కార్యాలయం ఈడీగా బదిలీ అయ్యారు. త్వరలో ఆర్‌ఆర్‌కే కిశోర్‌ కడపకు చేరుకుని బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి.

హోటల్‌కని వెళ్లిన

వ్యక్తి అదృశ్యం

శంషాబాద్‌ రూరల్‌ : ఇంటి యజమానితో కలిసి భోజనం తేవడానికి హోటల్‌కు వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. శంషాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ వై.సురేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. ఏపీలోని కడప వాసి పలగిరి రాజమోహన్‌రెడ్డి(29) భార్య దామిని, కొడుకుతో కలిసి ముచ్చింతల్‌లో కొంత కాలంగా అద్దెకు ఉంటున్నారు. దామిని జిమ్స్‌ ఆస్పత్రిలో వైద్య విద్య అభ్యసిస్తోంది. జూలై 31న రాత్రి ఇంటి యజమాని శివప్రసాద్‌తో కలిసి రాజమోహన్‌రెడ్డి తన కారులో భోజనం తేవడానికి పాల్మాకులలోని ఓ హోటల్‌కు వెళ్లి తిరిగి వచ్చారు. భోజనం పార్సిల్‌ను ఇంట్లో ఇవ్వడానికి వెళ్లగా రాజమోహన్‌ బయట నిలబడి ఉన్నారు. శివప్రసాద్‌ తిరిగి వచ్చి చూసేసరికి అతడు కనిపించలేదు. ఈ విషయమై అతని భార్య దామినికి చెప్పాడు. దీంతో అతనికి ఫోన్‌ చేయగా.. స్విచ్చ్‌ ఆఫ్‌ అయింది. అన్నిచోట్ల వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో శనివారం దామిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది.

అనుమానస్పద స్థితిలో

వ్యక్తి మృతి

వేంపల్లె : స్థానిక వైఎస్‌ఆర్‌ పార్క్‌ వెనుక వైపు ముళ్ల పొదలలో వడ్డే లక్ష్మీనర్సయ్య (35) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో శనివారం సాయంత్రం మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని అమ్మగారిపల్లె గ్రామానికి చెందిన ఆయన కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం వేంపల్లెలోని గాజులపేటలో నివాసముంటున్న తన తల్లి అనంతమ్మతో మాట్లాడి లక్ష్మీనర్సయ్య కూలి పనికి వెళ్లాడు. సాయంత్రం పార్కు వెనుక ముళ్ల పొదల్లో అతని మృతదేహాన్ని స్థానికులు చూసి సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ తిరుపాల్‌ నాయక్‌ పోలీస్‌ సిబ్బందితో వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతునికి భార్య అంజలి, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తల్లి అనంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement