మైదుకూరు : పట్టణంలోని ప్రొద్దుటూరు రోడ్డు చాకలి వీధిలో ఉంటున్న బడిమెల హరికృష్ణ(28) అనే యువకుడు శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, వీధిలోని వారు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో ఉన్న అటవీశాఖ చెక్ పోస్టు వద్ద హరికృష్ణ తమలపాలకులు, నిమ్మకాయలు విక్రయిస్తూ ఉంటాడు. మూడేళ్ల కిందట ఖాజీపేట మండలం అప్పనపల్లెకు చెందిన లక్ష్మీతో వివాహమైంది. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం భార్య 7 నెలల గర్భవతిగా ఉంది. శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఇంటి పైఅంతస్తులో హరికృష్ణ కుమారుడి కోసం భార్య చీరతో ఏర్పాటు చేసి ఉంచిన ఊయలను గొంతుకు చుట్టుకుని ఉరి వేసుకున్నాడు. భార్య లక్ష్మి కేకలతో చుట్టుపక్కల వారు వచ్చి హరికృష్ణను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. యువకుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదు.
వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
పులివెందుల రూరల్ : పులివెందుల మండలం కనంపల్లె గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గత మూడు రోజుల నుంచి మతి స్థిమితం సరిగా లేక కనంపల్లె గ్రామ సమీపంలో సంచరిస్తున్న గుర్తు తెలియని వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ట్రాఫిక్ ఎస్‌ఐ గంగాధర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
కుక్కల దాడిలో పొడదుప్పి మృతి.. మరొకటి క్షేమం
అట్లూరు : మండలంలో కుక్కల దాడికి గురై ఓ పొడదుప్పి మృతి చెందగా, మరో దుప్పిని స్థానికులు రక్షించిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కడప – బద్వేలు ప్రధాన రహదారిలోని దేవనగర్ సమీపంలో అడవి నుంచి తాగునీటి కోసం వచ్చిన ఓ పొడదుప్పిపై కుక్కలు గుంపుగా దాడి చేసి చంపి తిన్నాయి. అలాగే శనివారం సాయంత్రం కుంభగిరి పంచాయతీ కోనేటిపల్లి సమీపంలో మరో పొడదుప్పిని కుక్కలు వెంబడించడంతో, అది ప్రాణభయంతో స్థానిక కాలనీలోకి పరుగెత్తుకొచ్చింది. గమనించిన స్థానికులు కుక్కలను తరిమికొట్టి ఆ దుప్పిని రక్షించారు. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ మూగజీవానికి స్థానికులు ప్రాథమిక చికిత్స అందించి, తదుపరి సంరక్షణ కోసం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.


