బద్వేలు అర్బన్ : పట్టణంలోని తెలుగుగంగకాలనీ రోడ్డులో మంగళవారం రాత్రి ఓ వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. అర్బన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బి.మఠం మండలం గొడ్లవీడు గ్రామానికి చెందిన నేలటూరు హేమలత (31)ను 12 సంవత్సరాల క్రితం బి.కోడూరు మండలం ప్రభలవీడు గ్రామానికి చెందిన రఘురామిరెడ్డితో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రఘురామిరెడ్డి జీవనోపాధి నిమిత్తం కువైట్‌లో ఉంటూ 5 సంవత్సరాల క్రితం పట్టణంలోని తెలుగుగంగకాలనీలోకి నివాసాన్ని మార్చాడు. అయితే రఘురామిరెడ్డి గత కొంత కాలంగా మద్యానికి బానిసై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తుండటంతో భార్యభర్తల నడుమ తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి హేమలత ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందింది. ఘటనపై మృతురాలి తండ్రి గోపాలకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ ఎస్‌ఐ చిరంజీవి కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వివాహిత మృతికి కుటుంబ సమస్యలే కారణమని ప్రాథమికంగా తెలుస్తున్నప్పటికీ పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని అర్బన్ సీఐ రామకృష్ణ తెలిపారు.


