నిరుపేద.. ఆపై పెద్దబాధ | - | Sakshi
Sakshi News home page

నిరుపేద.. ఆపై పెద్దబాధ

Jul 30 2026 4:36 AM | Updated on Jul 30 2026 4:36 AM

రెండు కిడ్నీలు పాడై మంచానికి పరిమితమైన ఇంటర్‌ విద్యార్థిని

దాతల సహాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు

రాజంపేట టౌన్‌ : అందరి విద్యార్థుల్లా ఆ విద్యార్థిని తన భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. తండ్రి కార్పెంటర్‌ పనిచేస్తూ కష్టం మీద కుటుంబాన్ని పోషిస్తున్నందున తాను బాగా చదివి కుటుంబాన్ని పేదరికం నుంచి గట్టెక్కించాలనుకుంది రాజంపేట పట్టణం రామ్‌నగర్‌కు చెందిన పదాల పల్లవి. అయితే తాను ఒకటి తలిస్తే విధి మరొకటి తలిచింది. ఒక్కసారిగా ఆ విద్యార్థిని జీవితంలో అంధకారం ఆవహించింది. టెన్త్‌లో 520 మార్కులతో ఉత్తీర్ణులైన పల్లవి ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతుంది. ఈనేపథ్యంలో నాలుగు నెలల క్రితం ఒకరోజు రాత్రి పల్లవి ఉన్నట్లుండి మంచం మీద నుంచి కళ్ళు తిరిగి కింద పడటంతో తల్లిదండ్రులు సులోచన, రాజబ్రహ్మం రాజంపేటలోని ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్ళారు. వైద్యులు పల్లవి ఆరోగ్య పరిస్థితి చూసి పెద్ద ఆసుపత్రికి వెంటనే తీసుకెళ్ళాలని చెప్పడంతో తిరుపతిలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్ళారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసి పల్లవి రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయని చెప్పారు. ఇక అప్పటి నుంచి పల్లవి ఆరోగ్యం క్రమేపి క్షీణిస్తూ ఇప్పుడు డయాలసిస్‌ చేయించుకుంటూ మంచానికే పరిమితమైంది. ఒకవైపు తండ్రి రెక్కాడిస్తేనే డొక్కాడని ఆ కుటుంబానికి పూటకూడా గడవని దయనీయ పరిస్థితి. మరోవైపు కన్నబిడ్డ మంచానికే పరిమితం కావడం, మెరుగైన వైద్యం చేయించే స్థోమత లేక తల్లిదండ్రుల హృదయాలు తల్లడిల్లుతున్నాయి.

దాతలు సాయం కోసం..

దాతల సహాయంపైనే పల్లవి తల్లిదండ్రులు తమ బిడ్డ భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్నారు. తమ కిడ్నీలు ఇచ్చి బిడ్డను బతికించుకుందామనుకున్నా తల్లిదండ్రులు ఇద్దరు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు. ఎవరైనా ఒక కిడ్నీ దానం చేయాలని, కిడ్నీ మార్పిడికి దాతలు ఆర్ధిక సహాయం చేయాలని వారు విన్నవించుకుంటున్నారు. ప్రభుత్వం కూడా చేయూతనివ్వాలని వారు కోరుతున్నారు. ఎవరైనా దాతలు కిడ్నీ కాని, ఆర్ధికంగా సహాయం చేయాలనుకుంటే తమ కుమారుడు గోవర్దన్‌ పేరు వచ్చే 7675042141 ఫోన్‌పే నంబర్‌కు చేయవచ్చని తల్లిదండ్రులు కోరుతున్నారు.

మానవత్వం చాటిన షోయబ్‌

పల్లవి పరిస్థితిని సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకున్న తిరుపతికి చెందిన ఎంఎస్‌ఎస్‌ వెల్ఫేర్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు షోయబ్‌ పల్లవి ఆరోగ్యం కుదుటు పడేవరకు మందులను కొనుగోలు చేయించేందుకు ముందుకు వచ్చారు. ప్రస్తుతం పల్లవికి మందులకు అవసరమయ్యే ఖర్చులకు షోయబ్‌ సాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement