మైదుకూరు : ఎల్‌నినో ప్రభావం చూపుతున్న పరిస్థితుల్లో ఒక ప్రణాళికతో జిల్లాలోని రిజర్వాయర్లు, పెద్ద చెరువుల్లో 55 టీఎంసీల దాకా నీటిని నిల్వ చేశామని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు. మైదుకూరు మండలం తిప్పిరెడ్డిపల్లె, ముదిరెడ్డిపల్లె చెరువులకు తెలుగుగంగ నుంచి నీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన ఎత్తిపోతుల పథకానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ముదిరెడ్డిపల్లె చెరువు వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ రాబోవు రోజులు ఆశాజనకంగా లేవన్నారు. అక్టోబర్ వరకు 40–45 శాతం తక్కువ వర్షాపాతం ఉంటుందన్నారు. జిల్లాలోని రిజర్వాయర్ల సామర్థ్యం 80 టీఎంసీలు కాగా గత ఏడాది రబీ అనంతరం జూన్ 1 నాటికి 55 టీఎంసీల నీటిని నిల్వ చేసుకున్నామని తెలిపారు. రెండు నెలలుగా జిల్లాలో వర్షాభావంతో భూగర్భ జలాల మట్టం తగ్గుతూ తాగునీటి సమస్య తలెత్తుతున్నా ఇప్పటికీ జిల్లాలో 47 టీఎంసీల నీరు నిల్వ ఉందని కలెక్టర్ చెప్పారు. మైదుకూరు మండలంలోని తిప్పిరెడ్డిపల్లె, ముదిరెడ్డిపల్లె చెరువులకు డీఎంఎఫ్ నిధులు రూ.8.95 కోట్లతో ఎత్తిపోతుల పథకం ద్వారా నీటిని అందించనున్నుట్ట కలెక్టర్ తెలిపారు. ఈ పథకం అక్టోబర్ 20 కల్లా పూర్తి చేసి చెరువులకు నీటిని అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్, ఇరిగేషన్ ఎస్‌ఈ మల్లికార్జున పాల్గొన్నారు.
పాలిటెక్నిక్ కళాశాలకు
మౌలిక వసతులు కల్పిస్తాం
మైదుకూరులోని పాలిటెక్నిక్ కళాశాలకు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తామని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని కడప రోడ్డులో ప్రాథమిక పాఠశాల భవనాల్లో నిర్వహిస్తున్న పాలిటెక్నిక్ కళాశాలను పరిశీలించారు. కళాశాలలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ పార్థసారథి, అధ్యాపకులు తదితరులు కళాశాల సమస్యలను కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్ స్పందించి అత్యవసరంగా తాత్కాలిక వసతులు కల్పించేందుకు పట్టణంలోని అనుకుంటలో 80 శాతం పూర్తయిన గర్‌ల్స్ హైస్కూల్ భవనాలను త్వరగా పూర్తి చేసి పాలిటెక్నిక్ కళాశాలను అక్కడికి మార్పించేందుకు హామీ ఇచ్చారు.
మహిళల ఆరోగ్య పరిరక్షణకు సమగ్ర కార్యాచరణ
కడప సెవెన్‌రోడ్స్ : మహిళల ఆరోగ్యం, పోషకాహారం, రక్తహీనత నివారణ, మాతా శిశు సంక్షేమం వంటి అంశాల్లో.. ప్రతి గ్రామంలో ప్రజల్లో అవగాహన కల్పించేలా ‘ఉమెన్ ఫస్ట్’ ప్రచార కార్యక్రమాన్ని అమలు చేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జేసీ డా. నిధి మీనాతో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో.. కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో ‘ఉమెన్ ఫస్ట్’ కార్యక్రమ అమలు కార్యాచరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల ఆరోగ్యాభివృద్ధే కుటుంబం, సమాజం, భావితరాల అభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని పేర్కొంటూ వైద్య ఆరోగ్యం, ఐసీడీఎస్, విద్య, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో పలువురు ప్రొఫెసర్లు వర్చువల్ గా హాజరవ్వగా.. ఐసీడీఎస్ పీడీ రమాదేవి, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, ఇన్‌చార్జి డీఎహెచ్‌ఓ రవిబాబు, ఏపీసీ ఎస్‌ఎస్‌ఏ అనురాధ, డీఈఓ షంశుద్దీన్, వైద్యులు, న్యూట్రిషన్ శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ చెరుకూరి శ్రీధర్


